తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని సైదాబాద్ కాలనీలో భూలక్ష్మీ మాత దేవాలయంలో ఉద్యోగి మీద గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసాడు. ఏదో రసాయనం తల మీద చల్లాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి టోపీ, తలకు మాస్క్ ధరించాడు. గురువారం జరిగిన ఆ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
గురువారం భూలక్ష్మీ మాత గుడిలో అకౌంటెంట్ నరసింగరావు అలియాస్ గోపి ఏదో పని చేసుకుంటూ కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడకు వెళ్ళి నరసింగరావును ఏవో వివరాలు అడగసాగాడు. నరసింగరావు ఆ వ్యక్తికి జవాబిచ్చేందుకు పుస్తకాల్లోకి తొంగి చూస్తుండగా ఆ వ్యక్తి నరసింగరావు తల మీద ఏదో రసాయనం చల్లాడు. జరిగిన సంగతి గ్రహించే లోగానే ఆ వ్యక్తి అక్కడినుంచి పరారయ్యాడు. రసాయన పదార్ధం ప్రభావంతో నరసింగరావు చాలా ఇబ్బంది పడ్డాడు. స్థానికులు అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆగంతకుడి గురించి వివరాలు సేకరించడానికి దర్యాప్తు మొదలుపెట్టారు.