హైకోర్టు సూచనతో అధికారుల్లో కదలిక
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన శేషాచలం అటవీ ప్రాంతంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై తిరుమల తిరుపతి దేవస్థానం నివేదిక సిద్ధం చేసింది. ఓ పిటీషన్ విచారణ సందర్బంగా తిరుమలలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో అధికారుల్లో చలనమొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న మఠాల వివరాలతో ఓ నివేదికను సిద్ధం చేసింది.
తిరుమల పరిధిలో కేవలం హిందూ ధర్మప్రచారం కోసమే మఠాలకు భూములను కేటాయించాల్సి ఉంది. కానీ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు తిరుమల పచ్చదనానికి హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారు. మఠాలకు భూ కేటాయింపు పై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా దానిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు, తిరుమలను కాంక్రీట్ జంగిల్‌గా మార్చరాదని సూచించింది.
నిబంధనలకు విరుద్దంగా…
కర్ణాటకకు చెందిన భాగల్‌కోట్‌లోని బసవేశ్వర వీర శైవ సంఘ (BVSS) మఠం వారు గోగర్భం డ్యాం వద్ద ఓ నిర్మాణం చేపట్టారు.ఈ మఠానికి భూముల కేటాయింపు విషయంలో టీటీడీ మాజీ చైర్మన్ గా పనిచేసిన ఓ వ్యక్తి కారణమనే ప్రచారం జరుగుతోంది. శ్రీపాదరాజ మఠం నిర్మాణానికి భూములు ఇచ్చారు. శ్రీపాదరాజమఠం నిర్మాణం పై న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా ప్రస్తుతం నిర్మాణం ఆగిపోయింది. బీవీఎస్ఎస్ మఠం నిర్మాణం లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు టీటీడీ రెవెన్యూ విభాగం గుర్తించింది.
తిరుమల పరిధిలోని మౌనస్వామి మఠం, విశాఖ శారదాపీఠం మఠాలు భూ ఆక్రమణలకు పాల్పడినట్లు రెవెన్యూ తనిఖీల్లో తేలింది. మౌనస్వామి మఠం 1,870 చదరపు అడుగులు, విశాఖ శారదాపీఠం 1851.06 చదరపు అడుగులు, శ్రీ ప్రతివాది భయంకర్ మఠం 3,575, శ్రీ వల్లభాచార్యజీ మఠం 880, శ్రీ రామానుజ జీయర్ మఠం(శ్రీ రంగనాథ స్వామి, శ్రీరంగం) 1,500 చదరపు అడుగులు మేర ఆక్రమణకు పాల్పడినట్లు అధికారుల లెక్కల్లో తేలింది. అయితే గత ప్రభుత్వం చొరవతో ఈ ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తూ అప్పటి టీటీడీ పాలకమండలి మండలి తీర్మానం చేసింది. అనంతరం రాష్ట్రప్రభుత్వం మూడు మఠాలకు సంబంధించిన భూములను క్రమబద్ధీకరించింది.
మౌనస్వామి మఠానికి చదరపు అడుగుకు రూ.374, విశాఖ శారదాపీఠం మఠానికి రూ.964 చొప్పున స్థలాల లీజును ఆమోదిస్తూ ఆక్రమణలను క్రమబద్ధీకరించారు.మేదరమిట్ట సమీపంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆక్రమించిన 3,360 చదరపు అడుగుల స్థలాన్ని క్రమబద్ధీకరించేందుకు టీటీడీ బోర్డు డిసెంబరు 2023లో ఆమోదం తెలిపింది.