కన్నబిడ్డలనుకంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కసాయిలా మారిన ఘటన కాకినాడలో కలకలం రేపింది. పిల్లలు సరిగా చదువుల్లో రాణించడం లేదనే కోపంతో ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
తాడేపల్లిగూడేనికి చెందిన చంద్రకిషోర్ కాకినాడ సమీపంలోని వాకలపూడి ఓఎన్‌జీసీలో ఉద్యోగిగా చేస్తున్నారు. అతనికి భార్య తనూజ, పిల్లలు జోషిల్, నిఖిల్ ఉన్నారు. పిల్లలు చదువుల్లో రాణించడం లేదని వారి జీవితాలను కర్కశంగా అంతం చేశాడు.
హోలీ వేడుకలకు భార్య, పిల్లలను కార్యాలయానికి తీసుకెళ్లాడు. పిల్లలకు యూనిఫాం కొలతలకు టైలర్ వద్దకు తీసుకెళుతున్నానని, పది నిమిషాల్లో వస్తాను, ఇక్కడే ఉండమని భార్యకు చెప్పాడు. పిల్లలను తీసుకుని క్వార్టర్స్‌లోని తన ఇంటికి వెళ్లాడు. పిల్లలు జోషిల్, నిఖిల్ కాళ్లు చేతులు కట్టేసి, బకెట్లో నీరు పోసి వారి తలలు బలవంతంగా ముంచి చంపేశాడు. తరవాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతకీ భర్త రాకపోవడంతో ఆఫీసు సిబ్బందితో సహా భార్య ఇంటికి చేరుకుంది. కిటికీలో నుంచి చూడగా భర్త ఉరివేసుకుని కనిపించాడు. కార్యాలయ సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి చూడగా పిల్లలు విగతజీవులుగా కనిపించారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు చదువుల్లో రాణించడం లేదని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సైసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
చంద్ర కిషోర్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని, అప్పులు కూడా లేవని, ఆస్తులున్నాయని ఆయన సోదరి చెప్పారు. తన సోదరుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆమె పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.