చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి స్వామి సందర్శనార్థం వచ్చే భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని ఆలయ ఈఓ పెంచల కిషోర్… అధికారులను, ఇతర సిబ్బందినీ ఆదేశించారు. స్వామి కోసం వచ్చే భక్తులకు ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉండాలని సూచించారు. ఈఓ శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు, అర్చకులతో మాట్లాడారు.
దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్వామి దర్శనం వీలైనంత వేగంగా జరిగేలా చూడాలని ఈఓ కిషోర్ ఆలయ నిర్వాహకులకు సూచించారు. పరిస్థితిని బట్టి క్యూలైన్లను సర్దుబాటు చేస్తూ వీలైనంత ఎక్కువమంది భక్తులకు త్వరగా దర్శనాలు చేయించాలన్నారు. మొబైల్ కౌంటర్లు, టికెట్ కౌంటర్ల దగ్గరకు వచ్చే భక్తులను ‘గణేశా’ అంటూ సంబోధించాలని చెప్పారు. ఆ ప్రాంతంలో పరిశుభ్రతపై చర్చించారు.
ఆ సమావేశంలో కాణిపాకం ఈవో పెంచల కిషోర్‌తో పాటు ఏఈఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.