జగత్కల్యాణానికి భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం ముస్తాబైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న ఆగమశాస్త్రం ప్రకారం స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. నవమి ఏర్పాట్లను ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వేదోక్తంగా ప్రారంభించారు.
ఉత్తరద్వారం వద్ద పసుపు కొట్టే కార్యక్రమం ప్రారంభించారు. స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు విజయ రాఘవన్ నేతృత్వంలో రోలు రోకలికి దేవతలను ఆవాహన చేసి క్రతువు ప్రారంభించారు. తలంబ్రాలు కలిపారు. తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం మేరకు గులాల్ కలిపారు.
కుంకుమ, పసుపు, సెంటు, రోజ్ వాటర్, నూనె, నెయ్యి కలిపి పరిమళాలను జోడించారు. బేడా మండపం వద్ద స్వామివారికి అభిషేక మహోత్సవం నిర్వహించారు. స్వామివారికి డోలోత్సవం నిర్వహించారు. గోటి తలంబ్రాల తయారీ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఈఓ రమాదేవి పర్యవేక్షించారు.
పోస్టులో కళ్యాణ తలంబ్రాలు …
కళ్యాణోత్సవ తలంబ్రాలను నేరుగా వచ్చి తీసుకోలేని భక్తుల కోసం దేవాలయ అధికారులు కొరియర్ ద్వారా అందించే ఏర్పాట్లు చేశారు. భక్తులు https://bhadradritemple.telangana.gov.in/mt_bookings/?ssid=153 వెబ్ సైట్ ద్వారా తలంబ్రాలకు ఆర్డర్ ఇవ్వవచ్చు. చిరునామాను ఎంటర్ చేసి రూ. 60 చెల్లిస్తే ముత్యాల తలంబ్రాలను పోస్టు ద్వారా ఇంటికే పంపుతారు.
‘భద్రాచలం టెంపుల్ ఇన్‌ఫర్మేషన్’ యాప్‌ను ఆలయ ఈవో రమాదేవి ఇతర అధికారులు ఆవిష్కరించారు. పది రోజుల్లో ఈ యాప్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఈవో వెల్లడించారు.