జనసేన పార్టీని నిలబెట్టాం, నాలుగు దశాబ్దాల టీడీపీని బతికించామంటూ పిఠాపురం వేదికగా సాగిన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. లక్షలాది మంది అభిమానులు తరలిరాగా, పార్టీ నాయకుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం అద్యంతం అందరికీ ఆకట్టుకుంది.
2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరవాత చాలా మంది అసెంబ్లీ గేటు కూడా తాకలేవంటూ ఎద్దేవా చేశారని, 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ సీట్లు, 2 స్థానాలు గెలచి చూపించామని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. నాడు తొడలుగొట్టిన వారి నోళ్లు మూతపడ్డాయన్నారు. 11 సంవత్సరాల జనసేన పార్టీ ప్రస్థానంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదురైనా భయపడలేదన్నారు.తనకు సినిమా జీవితాన్ని ఇచ్చినా, ప్రజలకు సేవల చేసేందుకే రాజకీయాల్లో వచ్చాన్నారు. పదవీ వ్యామోహంతో కొందరు రాజకీయాల్లో వస్తున్నారని తనకు అలాంటి వ్యామోహాలు లేవన్నారు.
దేశంలో బహుభాషా విధానం అవసరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో హిందీ వ్యతిరేక రాజకీయాలను ఆయన తప్పుపట్టారు. హిందీని వ్యతిరేకించే వారు తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. డబ్బు కావాలి కానీ హిందీ అవసరం లేదా అని ప్రశ్నించారు. కేవలం త్రిభాషా విధానమే కాదని, బహుభాషా విధానం రావాలన్నారు. తమిళంలో ఆయన ప్రసంగం ఆకట్టుకుంది. కన్నడ అభిమానులను ఉద్దేశించి కన్నడలో మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో ప్రచారం చేశానని, తనకు అక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నట్లు గుర్తించినట్లు పవన్ చెప్పారు.
ఏపీని విభజిస్తే దేశం నుంచి విడిపోతామని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ప్రత్యేక దేశం కోరతామంటూ కొందరు నాయకులు చేసిన ప్రకటనలు ఆయన గుర్తుచేశారు. ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు కోసుకోవడానికి ఇదేమైనా కేకు ముక్కా అంటూ పవన్ ప్రశ్నించారు. దేశాన్ని విడగొట్టాలని ఒకరు ప్రయత్నం చేస్తే, దేశాన్ని ఏకం చేసేందుకు తనలాంటి 10 కోట్ల మంది రోడ్ల మీదకు వస్తారని పవన్ హెచ్చరించారు. జనసేన అనే శిశువును మనం కాపాడుకుంటే భవిష్యత్తులో అది దేశాన్ని రక్షిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పవన్ ( #pawankalyan) ప్రశంసలు కురిపించారు. మనం గెలవడంతోపాటు, నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించామన్నారు. క్లైమోర్ మైన్స్ పెట్టి పేల్చినా ప్రాణాలతో భయటపడి చొక్కా దులుపుకుని వెంటనే విధులు నిర్వహించిన చంద్రబాబునాయుడు అంతే తనకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. నాడు చంద్రబాబునాయుడు హైదరాబాదులో వేసిన హైటెక్ సిటీ బీజాలు నేడు ఐటీ విప్లవానికి నాంది పలికాయన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన విషయం తెలిసి తాను కలత చెందినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ వ్యవహారంలో ఏ మతం వారు ఉన్నారనేది ముఖ్యం కాదన్నారు. చివరకు విచారణలో లడ్డూ కల్తీ వ్యవహారంలో హిందువులు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ విషయంలో తాను ముస్లింలను విమర్శించలేదన్నారు. సెక్యులరిజాన్ని నిజమైన స్ఫూర్తితో చూడాలన్నారు. గోద్రా ఘటనను రెండో ఆలోచన లేకుండా ఖండించాలన్నారు. హిందు, ముస్లిం అనే తేడా లేకుండా ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిదేన్నారు.
కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో ఐదేళ్ల వైసీపీ పాలనతో జగన్మోహన్రెడ్డి చివరకు కామెడీ నటుడిలా మిగిలిపోయాడని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఇక జీవితంలో జగన్‌రెడ్డి సీఎం కాలేడని నాగబాబు జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన గర్వంతో అరాచకాలకు పాల్పడ్డ వైసీపీ నేతకు 2024లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని గుర్తుచేశారు.
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రి పదవిని పీకినా బాధపడలేదని, కానీ తన ఆస్తులు, తన వియ్యంకుడి ఆస్తులు గుంజుకున్నారంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జగన్‌రెడ్డి జీవితంలో ఇక సీఎం కాలేరంటూ బాలినేని సెటైర్లు వేశారు. జీవితాంతం జనసేన అధినేతకు అండగా ఉంటానన్నారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనేది తన జీవిత లక్ష్యమని బాలినేని వ్యాఖ్యానించారు.
పిఠాపురం సమీపంలో చాట్రాయిలో నిర్వహంచిన జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతమైంది. తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. లక్షలాది మందికి ఆహారం, మంచినీరు అందించారు. జయకేతనం సభను విజయవంతం కావడంతోపాటు, జనసేనాని పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగంతో జనసైనికుల్లో జోష్ నింపారు.