కేంద్రంలోని జాతీయవాద ప్రభుత్వంపై విద్వేషం, హిందూ-హిందీపై గుడ్డి వ్యతిరేకతతో వేర్పాటువాదాన్ని నెత్తినెత్తుకుంటున్న తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మరో దారుణానికి తెగబడింది. తమిళనాడు శాసనసభ తాజా సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో రూపాయి చిహ్నాన్ని మార్చేసారు. ‘రు’ అని తమిళంలో రాసే అక్షరాన్ని రూపాయి చిహ్నంగా ప్రవేశపెట్టారు. దాంతో మరో రాజకీయ వివాదం రాజుకుంది.
ప్రతీ విషయంలోనూ దేశానికి భిన్నంగా వ్యవహరిస్తామంటూ, తమది ప్రత్యేక దేశం అనే వైఖరిని ప్రదర్శిస్తోంది తమిళనాట స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం. ఆ క్రమంలో తాజా ధోరణే రూపాయి చిహ్నాన్ని మార్చివేసే ప్రయత్నం. ప్రస్తుతం ఉన్న రూపాయి చిహ్నం దేవనాగరి లిపి, హిందీ అక్షరాన్ని పోలి ఉందన్న సాకుతో దాన్ని ఉపయోగించడం తమిళ పౌరులకు ఇష్టం లేదనీ, తమిళ భాషలోని ‘రూ’ అనే అక్షరాన్నే ఉపయోగిస్తామనీ స్టాలిన్ సర్కారు స్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రం అమలు పేరుతో తమిళనాడు మీద హిందీని రుద్దుతున్నారంటూ రగడ చేస్తున్న స్టాలిన్, ఆ గొడవను ఇంకో అడుగు ముందుకు తీసుకువెళ్ళాడు. ఈసారి వేర్పాటువాదాన్ని కరెన్సీ ముద్రల సాక్షిగా ప్రదర్శించాడు.
డీఎంకే చర్యపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు అమల్లో ఉన్న రూపాయి జాతీయ చిహ్నం కథను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై వివరించారు. రూపాయికి చిహ్నాన్ని తయారు చేయడానికి 2010లో నాటి యూపీఏ ప్రభుత్వం ఒక పోటీ పెట్టింది. ఆ పోటీలో గెలిచిన చిహ్నాన్నే ఇప్పుడు మనం వాడుతున్నాం. దాన్ని రూపొందించిన వ్యక్తి డీఎంకే మాజీ ఎమ్మెల్యే కొడుకే.
ఆ విషయాన్నే అన్నామలై గుర్తుచేసారు. తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్, స్టాలిన్ చర్యను రాజ్యాంగ వ్యతిరేకమని అభివర్ణించారు. స్టాలిన్ ముందుగా తన పేరుకు తమిళ ప్రత్యామ్నాయాన్ని పెట్టుకోవాలని నిలదీసారు.
అందరికంటె పదునుగా స్పందించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆమె స్టాలిన్ సహా డీఎంకే నాయకుల ద్వంద్వ వైఖరిని కడిగి పడేసారు.
‘‘తమిళనాడు బడ్జెట్ 2025-26 డాక్యుమెంట్ల నుంచి డీఎంకే ప్రభుత్వం రూపాయి అధికారిక చిహ్నాన్ని (₹) తొలగించిందని తెలుస్తోంది.
డీఎంకేకు ₹ చిహ్నంతో సమస్య ఉంటే వాళ్ళు 2010లో ఎందుకు నిరసన తెలుపలేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆ చిహ్నాన్ని అధికారికంగా స్వీకరించినప్పుడు కేంద్రప్రభుత్వంలో అధికార కూటమిలో డీఎంకే కూడా భాగస్వామే కదా?
దురదృష్టవశాత్తు ₹ చిహ్నాన్ని డిజైన్ చేసింది డి ఉదయకుమార్ అనే యువకుడు. అతను డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్ ధర్మలింగం కుమారుడు. దాన్ని చెరిపివేయడం ద్వారా ఇప్పుడు డీఎంకే ఒక జాతీయ చిహ్నాన్ని మాత్రమే తిరస్కరించడం లేదు, దేశం కోసం ఒక తమిళ యువకుడు చేసిన సృజనాత్మక సేవను దారుణంగా అవమానిస్తోంది.
అసలు తమిళ రూపాయి పదానికి మూలాలు సంస్కృత పదం ‘రూప్యము’లో ఉన్నాయి. రూప్యము అంటే వెండి నాణెము అని అర్ధం. ఆ పదం తమిళ వ్యాపారం, సాహిత్యంలో ఎన్నో శతాబ్దాల నుంచి వినియోగంలో ఉంది. ఈరోజుకూ తమిళనాడులోనూ, శ్రీలంకలోనూ కరెన్సీని రూపాయి అనే వ్యవహరిస్తారు.
నిజానికి ఇండోనేషియా, మాల్దీవులు, మారిషస్, నేపాల్, సెషెల్స్, శ్రీలంక వంటి పలు దేశాలు తమ కరెన్సీ పేరుగా రూపాయి లేదా దాని సమానార్థక పదాలను వాడుతున్నాయి.
రూపాయికి ₹ చిహ్నం అంతర్జాతీయంగా మంచి గుర్తింపును సాధించింది. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో భారతదేశపు అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇప్పుడు యూపీఐ చెల్లింపులను విదేశాల్లో కూడా చెలామణీలోకి తెచ్చేందుకు భారతదేశం ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో మన సొంత జాతీయ కరెన్సీ చిహ్నాన్ని మనమే తక్కువ చేసుకోవడం లేదూ?
ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరం మన దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతనూ నిలబెడతామంటూ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాము. ₹ లాంటి జాతీయ చిహ్నాన్ని రాష్ట్ర బడ్జెట్ పత్రాల నుంచి తొలగించడం ఆ వాగ్దానానికి పూర్తి వ్యతిరేకం, అంతేకాదు, జాతీయ సమైక్యత పట్ల నిబద్ధత బలహీనపడడానికి సూచిక కూడా.
నిజానికి ఇది కేవలం ప్రతీకవాదం కంటె ఎక్కువైన చర్య. భారతీయుల ఐక్యతను బలహీనపరిచి, ప్రాంతీయ గర్వం పేరిట వేర్పాటువాద సెంటిమెంట్లను ప్రోత్సహించే చర్య. భాషా, ప్రాంతీయ దురహంకారానికి నిదర్శనం. దాన్ని పూర్తిగా విస్మరించవచ్చు’’ అని నిర్మలా సీతారామన్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.
స్టాలిన్ రచ్చ దేనికి?
తమిళనాడు శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ 11శాతానికి పైగా ఓట్లు సొంతంగా సాధించుకుంది. ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల మద్దతు లేకుండానే, రాష్ట్రంలోని పలు చిన్నపార్టీలతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ గరిష్ఠంగా సొంత బలం మీదనే బీజేపీ అంత ఓట్‌షేర్ సాధించింది. ఎంపీ స్థానాలకు ఎన్నికల్లో సీట్లు దక్కలేదు కానీ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి తక్కువగానే ఉంటుంది కాబట్టి కచ్చితంగా ఆ పార్టీ శాసనసభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంది.
బీజేపీని రాష్ట్ర శాసనసభలోకి రానీయకూడదనేది డీఎంకే ఆలోచన. అందుకే ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. సనాతన ధర్మ నిర్మూలన అంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేసాయన్న అనుమానం డీఎంకేలో ఉంది. ఆ నేపథ్యంలో విద్యావిధానంలో త్రిభాషా సూత్రం, పార్లమెంటు స్థానాల పునర్విభజన వంటి అంశాలతో తమిళ ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నది ద్రవిడ పార్టీల సహజ నైజం. దక్షిణ భారతదేశాన్ని ఉత్తరాది దోచుకుంటోందనీ, వారూ వీరూ పరస్పరం శత్రువులనీ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి డీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. అవి ఎంతవరకూ ఫలిస్తాయనేది ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.
ఆ నేపథ్యంలోనే రూపాయి చిహ్నం మీద స్టాలిన్ సహా డీఎంకే నేతలందరూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. భారతదేశపు అస్తిత్వాన్ని నాశనం చేయడమే వారి లక్ష్యం కాబట్టి ఈ దేశపు పరువు, ప్రతిష్ఠలకూ వారికీ ఏమాత్రం సంబంధం లేనట్లు నటిస్తున్నారు.