ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్ధులు ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. తొలుత వర్సిటీ ఆవరణలో హోలీ ఆడడానికి యాజమాన్యం అనుమతి ఇవ్వలేదు. స్థానిక బీజేపీ ఎంపీ రంగప్రవేశం తర్వాత విశ్వవిద్యాలయ అధికారులు దిగివచ్చారు.
ఏఎంయూ విద్యార్ధులు గతంలో హాస్టల్‌లోని తమ గదుల్లో మాత్రమే హోలీ ఆడుకునేవారు. అయితే విశ్వవిద్యాలయ ఆవరణలో హోలీ వేడుకలు జరుపుకోవడం ఇదే మొదటిసారి. దీనికి ముందు చాలా కథ జరిగింది. ఈ యేడాది విద్యార్ధులు నాన్ రెసిడెంట్ స్టూడెంట్స్ క్లబ్‌లో హోలీ వేడుకలు జరుపుకోడానికి అనుమతి మంజూరు చేయాలంటూ విశ్వవిద్యాలయ అధికారులను కోరారు. కానీ దానికి యాజమాన్యం ఒప్పుకోలేదు. అప్పుడు బీజేపీ స్థానిక ఎంపీ సతీష్ గౌతమ్ రంగంలోకి దిగారు.
‘‘జిన్నా తరహా మానసిక స్థితి కలిగిన వారే హోలీని వ్యతిరేకిస్తారు. జిన్నా భారత్ నుంచి వెళ్ళిపోయాడు కానీ ఆయన వంటి మానసిక స్థితి కలిగిన వారు ఇప్పటికీ ఇంకా ఏఎంయూలో ఉన్నారు. వాళ్ళ మెదళ్ళమీద పడిన జిన్నా ముద్రలు ఇంకా వదలలేదు. వాళ్ళు అరాచకవాదులు. వాళ్ళ మానసిక పరిస్థితి ఏమిటి? ఎవరైనా సమస్య కలిగిస్తే, లేక అరాచకంగా ప్రవర్తిస్తే, వారికి వారి భాషలోనే జవాబు ఇవ్వబడుతుంది’’ అని అలీగఢ్ ఎంపీ సతీష్ గౌతమ్ ఘాటుగా స్పందించారు.
విద్యార్ధుల విజ్ఞప్తులు, ఎంపీ ప్రకటన నేపథ్యంలో అనవసరంగా వివాదం దేనికనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయం అధికారులు హోలీ వేడుకలకు అనుమతి ఇచ్చారు. ముస్లిం యూనివర్సిటీలో హోలీ వేడుకల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసారు. పోలీసులు, పీఏసీ, ఆర్ఏఎఫ్ బలగాలను సిద్ధం చేసారు. హోలీ వేడుకల సమయంలో విద్యార్ధులకు ఏ ఆటంకాలూ కలగకుండా, అసాంఘిక శక్తులు ఎవరైనా వేడుకల్లో దూరి హింసాకాండకు పాల్పడకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. జిల్లా డీఎస్‌పీ అభయ్ కుమార్ పాండే స్వయంగా వర్సిటీ ఆవరణకు చేరుకున్నారు.
విశ్వవిద్యాలయం ఆవరణలో హోలీ వేడుకలకు అనుమతులు ఉన్నాయి. కొందరు విద్యార్ధులు తమకు ప్రత్యేక ఏర్పాట్లు కావాలని కోరారు. అలాంటి వారికి నాన్ రెసిడెంట్ స్టూడెంట్స్ క్లబ్‌లో వేడుకలు జరుపుకోడానికి అనుమతి ఇచ్చారు. దాంతో, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో మొదటిసారి రంగుల పండుగ సంబరాలు జరిగాయి.