తెలంగాణ వక్ఫ్ బోర్డు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కుమ్మరిగూడలో నిరంజన్ బాయి అనే మహిళకు వక్ఫ్ చట్టం 1995 కింద నోటీసులు పంపించింది. ఆ మహిళ వక్ఫ్ భూమిని ఆక్రమించుకుందంటూ నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డు సీఈఓ ముందు మార్చి 17న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ ఉంటున్న భూమికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలు చూపించాలని ఆదేశించింది. లేనిపక్షంలో తదుపరి చర్యల నిమిత్తం కేసును వక్ఫ్ ట్రిబ్యునల్‌కు రిఫర్ చేస్తామని హెచ్చరించింది.
ఈ నోటీసులు మార్చి 11న పంపించారు. వాటిలో ఆ మహిళలకు ఇప్పటికే రెండుసార్లు 2024 డిసెంబర్ 30న, 2025 జనవరి 31న నోటీసులు జారీ చేసినట్లుగా ఉంది. ఆ స్థలం యాజమాన్య హక్కులు నిరంజన్ బాయికి ఉన్నాయని నిరూపించుకోవాలని అడిగినప్పటికీ ఆమె ఆ నోటీసులకు తగిన గడువు లోగా జవాబివ్వలేదని వాటిలో పేర్కొన్నారు. అయితే నిరంజన్ బాయి తెలంగాణ వక్ఫ్ బోర్డు కార్యాలయానికి ఫిబ్రవరి 4న వెళ్ళింది, అక్కడ దరఖాస్తు దాఖలు చేసింది.
స్థానికుల కథనాల ప్రకారం ఆ ప్రాంతంలో ఒక మసీదు ఉంది, ఆ మసీదు పక్కన ఉన్న మూడు నివాసాలకు ఈ విధమైన నోటీసులు జారీ అయ్యాయి.
ఈ ప్రాంతం హాజీలాల్ మొహమ్మద్ మసీదుకు చేరువలో ఉంది. అంటే గత అక్టోబర్‌లో సల్మాన్ సలీం ఠాకూర్ అనే ముస్లిం వ్యక్తి చొరబడి ధ్వంసం చేసిన ముత్యాలమ్మ గుడి దగ్గరే ఉంది. అప్పుడు లభించిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ ముస్లిం వ్యక్తి దేవాలయాన్ని అపవిత్రం చేయడం, దేవతా మూర్తులను ధ్వంసం చేయడం, అక్కడినుంచి పారిపోవడం అంతా రికార్డు అయింది. ఆ దృశ్యాలు స్థానికంగా కలకలం సృష్టించడమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హిందువులను ఆగ్రహావేశాలకు గురిచేసాయి. తెలంగాణ పోలీసులు మాత్రం ఆ చర్యను ఒక దుండగుడి దుశ్చర్య మాత్రమే అని పేర్కొన్నారు. నిందితుడు మానసిక వికలాంగుడు అంటూ ఆ కేసులో మతపరమైన కోణాన్ని కొట్టిపడేసారు.
అయితే ఇప్పుడు అదే ప్రదేశంలోని మసీదు, స్థానిక హిందువులకు వక్ఫ్ చట్టం పేరిట నోటీసులు జారీ చేయడం చూస్తుంటే పెద్ద కుట్రే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో ఆ కేసులో నిందితులకు ఇదే మసీదులో ఆశ్రయం ఇవ్వడం, ఇప్పుడు అదే మసీదు పక్కనున్న నివాసాలు తమవేనంటూ వక్ఫ్ బోర్డు క్లెయిం చేసుకోవడం… ఆ పరిణామాలు కుట్ర అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వక్ఫ్ బోర్డు దూకుడు ధోరణి చూస్తుంటే వక్ఫ్ ఆస్తుల ముసుగులో భూములు ఆక్రమించుకునేందుకు చేస్తున్న కుట్రల్లో భాగం అనిపిస్తోందని విమర్శకులు చెబుతున్నారు.
నిరంజన్ బాయి ఆస్తి మీద వక్ఫ్ బోర్డుకు ఆసక్తి కలగడం కేవలం ఒక చట్టపరమైన వివాదం మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ముస్లిమేతర నివాసులను అక్కడినుంచి తరిమి కొట్టేందుకు ప్రణాళికాబద్ధంగా వేసిన అడుగు అయి ఉండవచ్చని స్థానికులు భయపడుతున్నారు. వక్ఫ్ అలాంటి భూముల మీద యాజమాన్యం తమదంటూ వక్ఫ్ బోర్డు ప్రకటించుకోవడం అనేది వివాదాస్పద భూముల మీద మతం ముసుగులో తమ ఆధిపత్యాన్ని విస్తరించే ప్రయత్నాల్లో ఒక భాగమని విమర్శకులు ఆరోపిస్తున్నారు. చట్టపరమైన చిక్కుల్లో ఉన్న భూమి విషయంలో న్యాయపరంగా ఒత్తిడి తీసుకురావడం, దీర్ఘకాలంగా ఆ స్థలానికి యాజమాన్య హక్కులు ఉన్నవారిని బ్యురాక్రటిక్‌గా వేధించడం అనే పద్ధతులను ఉపయోగించి ఆ ప్రాంతాలను ముస్లిం ప్రాబల్య ప్రాంతాలుగా మార్చేసే ప్రయత్నాలు అని విమర్శిస్తున్నారు.