కళ్ళు చెదిరే రంగులు, ఆహ్లాదకరమైన సంగీతం, నోరు తీపి చేసే మిఠాయిలు, అంతు లేని ఆనందం… హోలీ పండుగ అంటే రోజంతా వేడుకలే. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి రంగులు చల్లుకుంటారు, సంప్రదాయిక ఆహార పదార్ధాలతో వేడుక చేసుకుంటారు. ఈ రోజంతా కలిసిమెలిసి సంతోషంగా గడపడమే, సంబరాలు చేసుకోవడమే. అదే సమయంలో భారతదేశంలోని ఒక్కో ప్రాంతంలో హోలీని ఒక్కోరకంగా జరుపుకుంటారు.
లాఠ్‌మార్ హోలీ:
రాధాదేవి పుట్టిన ప్రదేశమైన ఉత్తరప్రదేశ్‌లోని బర్సానాలో లాఠ్‌మార్ హోలీ ఉత్సాహంగా జరుపుకుంటారు. బర్సానాకు చెందిన మహిళలు కృష్ణుడి ఊరైన నందగావ్‌కు చెందిన పురుషులను వెంటాడి కర్రలతో కొడతారు. రాధాకృష్ణుల మధ్య అన్యోన్యతకూ సరస సరాగాలకూ ప్రతీక ఆ వేడుక. లాఠ్‌మార్ హోలీ చాలా ఉత్సాహంగా, కళ్ళు చెదిరేలా, ఉల్లాసంగా సాగుతుంది.
ఫూలోం కీ హోలీ:
ఉత్తరప్రదేశ్‌లోని బృందావనం కృష్ణుడి బాల్యంలోని నివాస స్థానం. అక్కడ హోలీని మరో విధంగా జరుపుకుంటారు. మామూలుగా హోలీలో రంగులు చల్లుకునే పద్ధతికి బదులు అక్కడ సువాసనలు కలిగిన పూవుల రెక్కలు చల్లుకుంటారు. వాతావరణం అంతా తీయని పరిమళాలతో నిండిపోయి, మనసులను మత్తెక్కిస్తుంది. ఆ అద్భుతమైన వేడుక చూడాలంటే బన్‌కే బిహారీ ఆలయానికో, ఇస్కాన్ మందిరానికో వెళ్ళాలి.
రంగ్ పంచమి:
ఈ పూర్ణిమ తర్వాత ఐదవ రోజైన పంచమి రోజు రంగ్ పంచమి ఉత్సవం జరుపుకోవడం మహారాష్ట్రుల ఆనవాయితీ. ఆ పండుగ సందర్భంగా కుటుంబాలు, స్నేహితులూ కలిసి జానపద గీతాలు పాడుకుంటారు, సంప్రదాయిక తాళాలకు అనుగుణంగా నాట్యాలు చేస్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. హోలీ వాతావరణం అంతా వర్ణమయంగా వెలిగిపోతుంది.
హోలా మొహల్లా:
పంజాబ్‌లో జరుపుకునే హోలా మొహల్లా పండుగ బలాన్నీ, సమైక్యతనూ చాటిచెప్పే అద్భుతమైన సందర్భం. సిక్కుల్లో సమైక్యత సాధించడం కోసం గురుగోవింద్ సింగ్ ఈ పర్వదినాన్ని జరుపుకునే పద్ధతిని ప్రారంభించారు. ఈ పండుగ సందర్భంగా యుద్ధ కళలు ప్రదర్శిస్తారు, రంగురంగుల ఊరేగింపులు నిర్వహిస్తారు. సిక్కుల గర్వాన్నీ ధైర్య సాహసాలనూ ప్రదర్శించే సందర్భమిది.
వసంత ఉత్సవం:
పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతనంలో హోలీ పర్వదినాన్ని ప్రత్యేకంగా ‘వసంత ఉత్సవం’గా జరుపుకుంటారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ ప్రేరణతో ఆ పండుగను నాట్యం, సంగీతం, కవిత్వాల త్రివేణీ సంగమంగా జరుపుకుంటారు. విద్యార్ధులు కొట్టొచ్చినట్టు మెరిసే పసుపు, నారింజ వన్నెల దుస్తులు ధరిస్తారు. టాగోర్ రాసిన గీతాలు ‘రవీంద్ర సంగీత్’ పాడుతూ సంప్రదాయిక నృత్యాలు చేస్తూ రంగులతో ఆడుకుంటారు. ఆ ప్రశాంతమైన వేడుకలో సాహిత్యం, సంస్కృతి, కళలు సమ్మిళితమై ఉంటాయి.
షిగ్మో:
గోమంతక క్షేత్రం గోవాలో వసంతఋతువు ఆగమనానికి, చెడు మీద మంచి విజయానికీ చిహ్నంగా షిగ్మో అనే పండుగ జరుపుకుంటారు. గోవాలోని అతిపెద్ద పండుగల్లో ఇది ఒకటి. గొప్ప సంగీతం, నాట్యాల మధ్య రంగులు చల్లుకుంటూ సందడి చేస్తారు. భారీ పెరేడ్‌లతో వీధుల్లో చైతన్యం వెల్లివిరుస్తుంది. ఢోల్, తాషా, కాసాలే వంటి సంప్రదాయిక వాద్యాల నుంచి సంగీతం వాతావరణంలో ఉల్లాసం నింపుతుంది. గోవా ప్రాంతం అంతా ఉల్లాసం, ఉత్సాహం పెనవేసుకుని సంబరాలు చేసుకుంటాయి.