నూతన విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రం అమలు తమకు వద్దంటూ నాటకాలు ఆడుతున్న డిఎంకె ఎంపీలకు పార్లమెంటులో పరాభవం ఎదురైంది. హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్న డీఎంకే పార్టీ నేతల నిజరూపాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో బైటపెట్టారు.
డిఎంకె ఎంపీలు త్రిభాషా సూత్రం వంకతో పార్లమెంటులో రగడ చేస్తున్నారు. ఆ క్రమంలోనే మంగళవారం కూడా నిరసనలు తెలియజేసారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వారి నిరసనలు అనాగరికంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. దానిమీద కూడా డీఎంకే ఎంపీలు గొడవ చేసారు. అనవసరపు విషయం మీద రచ్చ దేనికని భావించిన ధర్మేంద్ర ప్రధాన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
అయితే ఆ సందర్భం ఆధారంగా డీఎంకే దొంగ నాటకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదే రోజు బైటపెట్టారు. తమిళం ఒక అనాగరిక, ఆటవిక భాష అని పదేపదే వెక్కిరించిన వ్యక్తిని డిఎంకె నెత్తిన పెట్టుకు పూజిస్తుందని ఆమె రాజ్యసభలో చెప్పారు. ఈవీ రామస్వామి నాయకర్ పేరు ప్రస్తావించకుండానే ఆ వ్యక్తి తమిళాన్ని ఎప్పుడూ ఆటవిక భాషగానే వ్యవహరించేవారని గుర్తు చేసారు. డీఎంకే ప్రతీచోటా ఆ వ్యక్తి ఫొటో పెట్టి దండ వేసి పూజలు చేస్తుందని, చివరికి పార్లమెంటులోని తమ పార్టీ కార్యాలయంలో సైతం అతని ఫొటో పెట్టుకుందనీ చెప్పారు.
‘‘మీ నిరసనలు అనాగరికంగా ఉన్నాయి అన్నంత మాత్రానికే వాళ్ళు విద్యాశాఖ మంత్రితో తన ప్రకటన వెనక్కి తీసుకునేలా చేసారు. కానీ, తమిళం ఒక ఆటవిక భాష అని పదేపదే వెక్కిరించిన వ్యక్తిని మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. వాళ్ళ కపటబుద్ధిని చూడండి. ప్రతీ గదిలోనూ అతని పటం పెట్టుకుంటారు, ఇక్కడ పార్లమెంటులో కూడా వారి పార్టీ కార్యాలయంలో అతని ఫొటో ఉంది. వాళ్ళు అతనికి దండలు వేస్తారు, అతన్ని పూజిస్తారు, ద్రవిడ ఉద్యమానికి ప్రతిరూపం అని ఆయనను పొగుడుతారు. కానీ అతనేమో తమిళం అడవి మనుషుల భాష అన్నాడు. అలాంటి వ్యక్తిని నెత్తికెత్తుకుని పూజిస్తారు, మీ నిరసనలు బాగా లేవు అన్న వ్యక్తిని మాత్రం దూషిస్తారు. తమిళంపై వారికి అంత ప్రేమే ఉంటే ఆ భాషను ఆటవిక భాష అన్న వ్యక్తిని ఎలా పూజిస్తారు?’’ అంటూ నిర్మల డీఎంకే సభ్యులపై విరుచుకుపడ్డారు.
దీనివల్ల ఒకటి స్పష్టమవుతోంది. డీఎంకేకు ప్రేమ అధికారం మీదనే తప్ప తమిళం మీద కాదు. త్రిభాషా సూత్రం అమలుపై గుడ్డి వ్యతిరేకతే తప్ప తమ మాతృభాషపై ప్రేమ కాదు. ద్రవిడవాదం పేరుతో తమిళనాట భారత జాతీయ వ్యతిరేకతకు బీజాలు వేసిన రామస్వామి నాయకర్ తమిళాన్ని అడుగడుగునా అవమానించాడన్న సంగతిని నిర్మలా సీతారామన్ బైటపెట్టారు. అలాంటి వ్యక్తి పేరు చెప్పి డీఎంకే పబ్బం గడుపుకుంటోంది. హిందీపై గుడ్డి ద్వేషంతో త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తోంది. జాతీయవాదంపై విద్వేషంతో రగిలిపోతూ తమిళ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే తమ ఆరాధనీయుడు రామస్వామి నాయకరే తమిళాన్ని నిందించాడన్న సంగతిని దాచిపెట్టి తమిళ ప్రజానీకాన్ని తన స్వార్థ రాజకీయ అవసరాల కోసం మోసం చేస్తోంది.