లౌకికవాదం పేరిట అన్యమతాలను బుజ్జగించడం, హిందూమతంపై ఆంక్షలు విధించడం రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. ప్రస్తుతం ముస్లిముల రంజాన్ మాసం జరుగుతోంది. అదే సమయంలో రేపు శుక్రవారం ఫాల్గుణ పూర్ణిమ నాడు హిందువులు హోలీ పండుగ జరుపుకుంటారు. దాంతో లౌకికవాద పార్టీల అసలు రంగులు బైటపడ్డాయి. ముస్లిములను బుజ్జగించడం కోసం హోలీ పండుగ రోజు సంబరాలు జరుపుకోవద్దంటూ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు.
మన కళ్ళ ముందరి ఉదాహరణలే చూద్దాం. తెలుగు రాష్ట్రాలు రెండూ రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు గంట ముందు ఇళ్ళకు వెళ్ళిపోవచ్చునంటూ ప్రత్యేకంగా జీవోలు జారీ చేసాయి. వారి కోసం రాత్రంతా దుకాణాలు తెరచి ఉంచుకోడానికి అనుమతులు మంజూరు చేసాయి. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో రాయచోటి నగరంలో వీరభద్రస్వామి పారువేట ఉత్సవం సందర్భంగా జరుగుతున్న ఊరేగింపు మీద ముస్లిములు రాళ్ళు రువ్వి, హిందూ మహిళలపై దాడులు చేసారు. అదేమిటని అడిగినందుకు పోలీసులు 200మంది హిందువులపై కేసులు నమోదు చేసారు. ఆ ఊరేగింపు నిర్వహణకు హిందువులు ముందుగానే పోలీసు అనుమతి తీసుకున్నా, లాభం లేకపోయింది. తెలంగాణలో భారత జట్టు క్రికెట్‌లో గెలిచినందుకు సంబరాలు జరుపుకుంటున్న క్రీడాభిమానుల మీద ముస్లిములు మసీదులోనుంచి బైటకు వచ్చి రాళ్ళు రువ్వి, భౌతిక దాడులకు పాల్పడ్డారు. హోలీ పండుగ సందర్భంగా హిందువులు రహదారుల మీద రంగులు జల్లుకుంటూ వేడుకలు చేసుకోకూడదంటూ ఆంక్షలు విధించారు.
ఈ ఏకపక్ష లౌకికవాదం విద్యాసంస్థలకూ అంటుకుంది. ఒక పక్క రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందులు ఇస్తున్నాయి. అలా విద్యాసంస్థలే ఇఫ్తార్ దావత్‌లు నిర్వహించిన సందర్భాల వివరాలను ఇక్కడ చూడవచ్చు: (విద్యాసంస్థల్లో ఇఫ్తార్ విందులు సోకాల్డ్ సెక్యులరిజానికి విరుద్ధం కాదా?)
అదే సమయంలో దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థలు హిందువుల పండుగల సమయాల్లో మాత్రం సోకాల్డ్ సెక్యులరిజాన్ని పక్కకు నెట్టేస్తున్నాయి. హోలీ పండుగ జరుపుకోడాన్ని నిషేధించిన విద్యాసంస్థలు ఎన్నో ఉన్నాయి. ఒక మతాన్ని గొప్పగా ప్రచారం చేస్తూ, ఈ దేశపు సంప్రదాయాలను మాత్రం అణగదొక్కేస్తున్నాయి. అలాంటి సందర్భాలను పరికిద్దాం.
2025 మార్చి 11: హోలీ పండుగ రోజు పాఠశాలకు రంగులు తీసుకురాకూడదు, పాఠశాల ఆవరణలో మిత్రులతో హోలీ ఆడకూడదు అంటూ రాజస్థాన్ జైపూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల తమ విద్యార్ధులను ఆదేశించింది. తమ మాట వినకుండా హోలీ ఆడితే, అలాంటి విద్యార్ధులను పరీక్షలు రాయకుండా నిలిపివేస్తామని హెచ్చరించింది.
2025 మార్చి 8: ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ పట్టణంలో సెయింట్ జోసెఫ్ పాఠశాల తమ విద్యార్ధులకు హోలీ ఆడడంపై నిషేధం విధించింది. పాఠశాల ఆవరణలోనే కాదు, బైట కూడా పిల్లలు హోలీ పండుగ జరుపుకోకూడదంటూ హెచ్చరించింది. మాట వినని విద్యార్ధుల పరీక్షలను రద్దు చేసేస్తామని బెదిరించింది. రంగులు కొనుక్కోడానికి పిల్లలకు డబ్బులు ఇవ్వవద్దంటూ తల్లిదండ్రులకు సూచించింది.
2025 జనవరి 3: యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ‘ఏఎంయూ’ ఈ యేడాది ‘హోలీ మిలన్’ వేడుకకు అనుమతి నిరాకరించింది. విశ్వవిద్యాలయం ఆవరణలో హోలీ జరుపుకోడాన్ని పూర్తిగా నిషేధించింది. విద్యార్ధులు తమ హాస్టల్ గదుల్లోనూ, క్యాంపస్‌లో సాధారణ ప్రదేశాల్లోనూ మాత్రమే హోలీ చేసుకోవచ్చునంటూ ఆంక్షలు విధించింది. ఆ నిర్ణయం వివాదాస్పదమైంది. హోలీ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోతే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేస్తామంటూ హిందూ విద్యార్ధులు తిరగబడ్డారు. దాంతో ఏఎంయూ అధికారులు వెనక్కి తగ్గారు. చివరికి, హోలీ మిలన్ జరుపుకోడానికి మార్చి 7న అనుమతి ఇచ్చారు.
2024 మార్చి 16: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయ ఆవరణలో హోలీ వేడుకలు జరుపుకోకూడదంటూ నిషేధాజ్ఞలు విధించింది. విశ్వవిద్యాలయం ఆదేశాలతో మండిపడిన విద్యార్ధులు ఏబీవీపీ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. హోలీ సందర్భంగా దుండగులు గొడవలకు పాల్పడతారంటూ వర్సిటీ యాజమాన్యం చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలియజేసారు. హిందువుల పర్వదినం మీద వక్రభాష్యాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
2023 మార్చి 4: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ యాజమాన్యం, విశ్వవిద్యాలయం ఆవరణలో హోలీ వేడుకలపై నిషేధం విధించింది. మదన్ మోహన్ మాలవ్యా స్థాపించిన హిందూ విద్యాసంస్థలోనే హిందూ పండుగ మీద నిషేధం విధించడాన్ని విద్యార్ధులు తీవ్రంగా నిరసించారు. వర్సిటీ నిర్ణయం నియంతృత్వ పోకడ అంటూ మండిపడ్డారు. హిందూ సంస్థల సహాయంతో ఆందోళనలు చేపట్టారు. దాంతో విద్యాసంస్థ అధికారులు దిగివచ్చారు. నిషేధాజ్ఞలను ఉపసంహరించుకున్నారు.
2023 మార్చి 1: ఢిల్లీ విశ్వవిద్యాలయం అధికారులు క్యాంపస్‌లో హోలీ ఆడడంపై నిషేధం విధించారు. రంగులు, రంగు నీటి బెలూన్లు, వాటర్ గన్స్ ఉపయోగించే విద్యార్ధుల మీద ర్యాగింగ్, వేధింపులు, లైంగిక దుష్ప్రవర్తన నిబంధనల పేరిట చర్యలు తీసుకుంటామంటూ బెదిరించారు.
యూనివర్సిటీ అధికారుల పరుష పదజాలంతో కూడిన నిషేధాజ్ఞల మీద ఏబీవీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘హోలీ పండుగ చెడుపై మంచి విజయానికి సూచిక, ఆ పండుగ వ్యక్తులలోని దుర్గుణాలను దహనం చేసి వారిని మరింత మెరుగైన వారిగా తీర్చిదిద్దుతుంది’ అంటూ పండుగ అంతరార్ధాన్ని వివరించింది.
అయినా డీయూ యాజమాన్యం తీరు మార్చుకోలేదు. మార్చి 2న మరో ఆదేశం జారీ చేసింది. యూనివర్సిటీలోని గరల్స్ హాస్టల్ నుంచి విద్యార్ధినులు హోలీ పండుగ సందర్భంగా మార్చి 7, 8 తేదీల్లో హాస్టల్ నుంచి బైటకు రాకూడదని ఆదేశించింది. మహిళా దినోత్సవం నాడే మహిళలను హాస్టల్లో ఖైదుచేసింది. ఆరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ విద్యార్ధినులు బైటకు రాకూడదంటూ ఉత్తర్వులు జారీచేసింది.
2017 మార్చి 12: కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు కళాశాలలు హోలీ వేడుకలపై నిషేధం విధించాయి. మౌంట్ కార్మెల్ కాలేజ్, బీఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, శేషాద్రిపురం కాలేజ్, కర్ణాటక చిత్రకళా పరిషత్, సెయింట్ జోసెఫ్స్ కామర్స్ కాలేజ్ వంటి కళాశాలలు తమ ఆవరణల్లో హోలీ ఆడకూడదంటూ విద్యార్ధులను ఆదేశించాయి. రంగులే ప్రధానమైన చిత్రకళా పరిషత్ రంగుల పండుగను నిషేధించడం విచిత్రం, దానికి చెప్పిన కారణం ఇంకా విచిత్రం. కళాశాలలో నీటి కొరత ఉందనీ, అందువల్ల చిత్రలేఖనాలు పాడయ్యే ప్రమాదం ఉందనీ వారు వాదించారు.
2016 మార్చి 21: అలహాబాద్ యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌లో హోలీ వేడుకలను నిషేధించారు. విద్యార్ధులు సంబరాల్లో భాగంగా డాన్సులు చేయడం పబ్లిక్ న్యూసెన్స్ అవుతుందని, అందువల్ల వర్సిటీ ఆవరణలో వేడుకలు చేసుకోకూడదనీ ఆదేశించారు. విద్యార్ధులు హాస్టల్ గదుల్లోనే హోలీ చేసుకోవాలనీ, బైటకు రావడానికి వీల్లేదనీ ఆదేశించారు. నిషేధాజ్ఞలు సవ్యంగా అమలయ్యేలా పర్యవేక్షించడానికి హాస్టల్ వార్డెన్లనూ సూపరింటెండెంట్‌లనూ నియమించారు.
భారతీయమైన పర్వదినాలు సామూహికంగా సంతోషాన్ని పంచిపెట్టేవి. అందునా హోలీ వంటి రంగుల పండుగ ప్రజలందరినీ దగ్గర చేస్తుంది. ఒకరిపట్ల ఒకరి ఆదరాభిమానాలను ఇనుమడింపజేస్తుంది. లౌకికవాదం పేరిట అలాంటి పర్వదినాన్ని జరుపుకోనీయకపోవడం వెనుక ప్రధాన కారణం, విద్యార్ధుల్లో హిందూ చైతన్యాన్ని అణచివేయాలన్న దురుద్దేశమే. ఇంక ఈ యేడాది రంజాన్ మాసపు శుక్రవారం కూడా కలసిరావడంతో ముస్లిం సంతుష్టీకరణలో భాగంగా హోలీ పండుగను ఎలాగైనా జరపకుండా చేయాలని పన్నాగాలు పన్నుతున్నాయి.