రాయలసీమలో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక గురువు కాశినాయన ఆశ్రమంలో నిర్మాణాలను గతవారం కూల్చివేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటవీచట్టాల ఉల్లంఘన సాకుతో ఆ నిర్మాణాలను అటవీశాఖ కూల్చివేయడం హిందువులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసారు. కాశినాయన ఆశ్రమాన్ని పరిరక్షించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం సమర్పించారు.
‘‘కాశినాయన రాయలసీమ ప్రాంతంలో ప్రజలందరికీ గౌరవనీయులైన ఆధ్యాత్మిక గురువు. ఆయన బోధనలు కరవు పీడిత రాయలసీమలోని వేలాది మంది రైతులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. వారి మొదటి పంటలను దానం చేయడానికి, రాయలసీమ అంతటా అన్నదాన క్షేత్రాలను స్థాపించడానికీ వారిని ప్రేరేపించాయి. ఆయన ఆశ్రమాలు, ముఖ్యంగా దట్టమైన నల్లమల అడవిలో ఉన్న ప్రతిష్టాత్మక జ్యోతి క్షేత్రం, లక్షలాది మంది పేదలకు సేవ చేసింది. భక్తులు కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 100కు పైగా అన్నదాన సత్రాలను నిర్వహిస్తున్నారు, వివక్ష లేకుండా అందరికీ ఉచిత భోజనం అందిస్తున్నారు. ఆయన చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా, ప్రభుత్వం కడప జిల్లాలో ఒక మండలానికి ఆయన పేరు పెట్టింది. దాన్ని ‘‘శ్రీ అవధూత కాశీనాయన మండలం’’ అని పిలుస్తారు.
నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ – ఎన్బిడబ్ల్యుఎల్ వద్ద ప్రతికూల నిర్ణయం ఆధారంగా నంద్యాల జిల్లా అడవిలోని నల్లమల మధ్యలో ఉన్న జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమాన్ని కూల్చివేసేందుకు అటవీ శాఖ ఇటీవల తీసుకున్న నిర్ణయం భక్తులలో తీవ్ర బాధను కలిగించింది, రాయలసీమ జిల్లాలలో విస్తృత ఆందోళనను రేకెత్తించింది. ఆ ఆలయం వేలాదిమంది భక్తులకు ఆధ్యాత్మిక సామరస్యాన్ని అందిస్తోంది. దాని సంరక్షణ సాంస్కృతిక, మత సామరస్యానికి చాలా ముఖ్యమైనది’’ అంటూ ఆ వినతి పత్రంలో కోరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి నాయకత్వంలో ఈరోజు కడప జిల్లాకు చెందిన 13 మంది నాయకులు కేంద్ర మంత్రి వద్దకు వెళ్ళారు. ఆ బృందంలో ఎంఎల్ఎ సి ఆది నారాయణ రెడ్డి, పార్టీ నాయకులు కె రితీష్ రెడ్డి, వి శశిభూషణ్ రెడ్డి, సి భూపేశ్ రెడ్డి, సి రాజేష్ రెడ్డి, పి సురేష్, మద్దూర్ నాగరాజు, యర్రం విష్ణువర్ధన్ రెడ్డి, సందీప్ పోలేపల్లి, స్వామి విరజానంద, బొమ్మన సుబ్బారాయుడు, సంగారెడ్డి శ్రీరామ చంద్ర, పి ఉమాకాంత్ రెడ్డి ఉన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి జ్యోతిక్షేత్రం ప్రాముఖ్యత, ఆ ఆశ్రమాన్ని పరిరక్షించవలసిన ఆవశ్యకత గురించి వివరించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు, ఆశ్రమ పరిరక్షణకు చేయగలిగినంతా చేస్తామన్నారు.