ప్రముఖ ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి. ఈ పేరుతో బహుశా ఆయనను ఎక్కువ మంది వెంటనే గుర్తించకపోవచ్చు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి, లేదా సాయిరెడ్డి అంటే మాత్రం ఠక్కున గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆయన వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడుగా గుర్తింపు పొందారు. వైసీపీ నేతగా అదే స్థాయిలో వైసీపీ శ్రేణుల నుంచి ఆదరణ పొందారు.
విజయసాయిరెడ్డి తొలినాళ్ళలో వైఎస్ రాజారెడ్డి కి ఆడిటర్ గా వ్యవహరించేవారు. రాజారెడ్డి మాజీ సీఎం జగన్ కు తాత, దివంగత సీఎం వైఎస్సార్ కు తండ్రి.
దివంగత సీఎం వైఎస్ కుటుంబానికి మూడు తరాలుగా ఆస్తి లెక్కలు చూసిన మాజీ రాజ్యసభ సభ్యుడు, ఆడిటర్ విజయసాయిరెడ్డి ఒక్కసారిగా భిన్నస్వరం వినిపించడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తోంది.
రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ కుటుంబానికి ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి గతంలో సాక్షి మీడియాలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పాలనలో వైఎస్ జగన్ పై నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. క్విడ్ ప్రో కో కేసులో జగన్ ఏ1గా ఉంటే సాయిరెడ్డి ఎ2 గా ఉన్నారు. అందుకే రాజకీయ ప్రత్యర్థులు ఆయనను A2 అంటూ హేళన చేస్తారు. జగన్ తో పాటు సీబీఐ, ఈడీ కేసుల్లో విజయసాయిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుల్లో భాగంగా జైలు జీవితం కూడా గడిపారు. ఆ తర్వాత కేసుల్లో భాగంగా తనకు ప్రాణహాని జరిగే అవకాశం ఉందంటూ భద్రత కోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. 2019 ఎన్నికల వరకూ విజయసాయిది ఒక పాత్ర అయితే ఆ తర్వాత నుంచి మరో చరిత్రగా ఉంది.
2014లో వైసీపీ ఓటమి తర్వాత నుంచి జగన్ పార్టీలో క్రియాశీలకంగా మారారు. పెద్దలసభకు ఆయనను జగన్ తన పార్టీ తరఫున నామినేట్ చేశారు. 2019లో వైసీపీ విజయంతో ఆయనే నంబర్ 2 అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్ర ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే అధినేతలో విభేదాలు ఏర్పడ్డాయనే వాదన కూడా ఉంది.
కానీ ప్రస్తుతం ఆయన వైసీపీ ని వీడారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయం మానేసి సేద్యం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఆయన తన మాజీ బాస్ జగన్ భవిష్యత్ పై ఆందోళన వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగన్ చుట్టూ ఓ కోటరీ ఉందని దాని నుంచి తన మాజీ బాస్ బయటపడాలని దానిని ఛేదిస్తేనే తన మాజీ అధినేత కు రాజకీయ భవిష్యత్ ఉంటుందని జోస్యం చెప్పారు.
వైసీపీకి ఎనలేని సేవలందించానని అధినాయకుడైన జగన్ కూడా తనకు ఎన్నో పదవులు ఇచ్చారని ఆనందం వ్యక్తం చేస్తూనే తనకు అవమానాలు కూడా ఎదురయ్యాయని వాపోవడం రకరకాల అనుమానాలకు తావిస్తోంది.
ఇన్నాళ్లూ నోరెత్తకుండా పార్టీ ఓడిన తర్వాత సాయిరెడ్డి ఇలా మాట్లాడుతున్నాడేంటి అని ఆ పార్టీ కరుడుగట్టిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. షర్మిలలా చంద్రబాబు డ్రామాలో పాత్రధారుడిగా మారారని కొందరు వైసీపీ కార్యకర్తలు మీడియా ముఖంగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
కడప రెడ్ల పెత్తనాన్ని నెల్లూరు రెడ్లు భరించలేకపోతున్నారని మరికొందరు సెటైర్లు వేసుకుంటున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి సహా వైఎస్ కుటుంబం, కడపకు చెందిన కొందరి కారణంగానే ఆయన పార్టీకి దూరమయ్యారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే కారణం ఏదైనా పార్టీ, అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు సాయిరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారేంటే అనే చర్చ పెద్ద ఎత్తున వైసీపీ కేడర్ లో జరుగుతోంది.
వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలతో హైదరాబాద్ వేదికగా సాయిరెడ్డి భేటీ అయ్యారు. గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఆమెతో పలు విషయాలు చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన షర్మిల, సాయిరెడ్డి, వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నారని సానుభూతి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల గొడవలు ఉండగా న్యాయస్థానల్లో అందుకు సంబంధించిన పిటిషన్ల విచారణ జరుగుతోంది.
సాయిరెడ్డి నిజంగానే జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే వైసీపీని వీడాల్సి వచ్చిందా లేదా కూటమి ప్రభుత్వంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొలేక ఈ డ్రామాకు తెరదీశారా అనేది తేలాలంటే ఇంకొంత సమయం పట్టేలా ఉంది.
గతంలో పార్టీ కార్యక్రమాల సమన్వయంలో భాగంగా ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి, రాయలసీమకు సజ్జల రామకృష్ణారెడ్డి, కోస్తాంధ్రకు వైవీ సుబ్బారెడ్డి ఇంచార్జీలుగా ఉండేవారు. వైవీ, సజ్జలతో ఆయనకు పొసగకపోవడంతోనే పార్టీని వీడారనే చర్చ నడుస్తోంది. కేవీ రావు తనపై చేసిన ఆరోపణలను తిప్పికొడుతూనే వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారు. కేవీరావుతో వైవీ సుబ్బారెడ్డికి ఉన్న సంబంధాలను మీడియాముఖంగా వెల్లడించారు.
జనసేన అధినేత పవన్ ను విజయసాయిరెడ్డి నేరుగా ఎప్పుడూ విమర్శించలేదు. అయితే పవన్ తన బాల్య స్నేహితుడు కావడంతోనే వ్యక్తిగత విమర్శలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ విషయం కూడా జగన్ కు సాయిరెడ్డి మధ్య దూరం పెరగడానికి కారణమై ఉండొచ్చు.
వైసీపీని వీడి వ్యవసాయం చేసుకుంటానన్న సాయిరెడ్డి, చంద్రబాబుకు రాజకీయంగా సాయం చేస్తారా లేదా సమయం చూసి బీజేపీ, జనసేనలో చేరి మరో పవర్ సెంటర్ గా మారతారా… అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పట్లో అయితే దొరికే పరిస్థితి లేదు.