విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకూ మెట్రో రైల్ ప్రతిపాదన లేదని పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. ఇవాళ్టి శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రశ్నకు మంత్రి నారాయణ జవాబిచ్చారు.
విశాఖలో మెట్రో రైల్ కారిడార్ విషయంలో 2051 నాటికి ట్రాఫిక్ రద్దీ ఎంత పెరగవచ్చు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని డీపీఆర్ రూపొందించామని మంత్రి వివరించారు. పీక్ అవర్ పాసింజర్ డైవర్షన్ ట్రాఫిక్ ఆధారంగా మెట్రో రైల్ ఏర్పాటు గురించి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలియజేసారు.
‘‘పాసింజర్ డైవర్షన్ కనీసం పదివేలు ఉంటేనే మెట్రో రైల్ కు అనుమతి వస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు పీక్ అవర్ ట్రాఫిక్ 10వేలకు పైగా ఉన్నందున ఆ కారిడార్లకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. అయితే స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు పీక్ అవర్ ట్రాఫిక్ 3763 మాత్రమే రావడంతో ఆ లైన్‌లో మెట్రోరైలు ఏర్పాటు కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. ట్రాఫిక్ డైవర్షన్ కోసం ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నాం’’… అని మంత్రి నారాయణ వివరించారు.