క్రిప్టో కరెన్సీ పేరుతో 96 బిలియన్ డాలర్ల దోపిడీకి పాల్పడిన లిథువేనియాకు చెందిన అలెక్సెజ్‌ను సీబీఐ అధికారులు కేరళలో అరెస్ట్ చేశారు. గారెంటెక్స్ పేరుతో క్రిప్టో ఫ్లాట్‌ఫాం సృష్టించి అమెరికాలో లక్షలాది మందితో పెట్టుబడులు పెట్టించి మోసానికి పాల్పడ్డారు. అలెక్సెజ్‌పై అనేక కేసులు నమోదు కావడంతో మోస్ట్ వాంటెండ్ జాబితాలో చేర్చారు. 2022లో అమెరికా నుంచి పారిపోయాడు. తాజాగా అతని కదలికలు కేరళలో గుర్తించడంతో అమెరికా ఎఫ్‌బిఐ విదేశాంగశాఖకు సమాచారం అందించింది.
నిఘా వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ, కేరళ పోలీసుల సహకారంతో అలెక్సెజ్‌ను తిరువనంతపురంలో అరెస్ట్ చేశారు. వేరే దేశానికి పారిపోవడానికి సిద్దం అవుతున్న తరుణంలో సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఇతను రూ.8 లక్షల కోట్లకుపైగా ప్రజల వద్ద నుంచి క్రిప్టో పేరుతో దోపిడీకి పాల్పడ్డాడని అమెరికాలో కేసులు నమోదయ్యాయి.