పశ్చిమ బెంగాల్ బీర్‌భూమ్ జిల్లా శాంతినికేతన్‌లోని సోనాఝూరీ హాట్‌లో హోలీ పండుగ జరుపుకోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. హోలీ వేడుకల్లో చల్లుకునే రంగునీళ్ళ వల్ల ఆ ప్రాంతంలోని చెట్లు నాశనమైపోయే ప్రమాదం ఉందంటూ నిషేధాజ్ఞలు జారీ చేసింది.
సోనాఝూరీ హాట్ అనేది విశ్వభారతి విశ్వవిద్యాలయం శాంతినికేతన్ క్యాంపస్ దగ్గరున్న ప్రముఖ వ్యాపారస్థలం. శాంతినికేతన్ క్యాంపస్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అక్కడ హోలీ ఆడడం కాదు కదా గుంపులుగా జనాలు కూడా చేరకూడదని బెంగాల్ అటవీశాఖ ఆదేశాలు జారీచేసింది.
సోనాఝూరీ హాట్ వచ్చే స్వదేశీ, విదేశీ పర్యాటకులు సహా సాధారణ ప్రయాణికులు ఎవరూ మార్చి 14 హోలీ పండుగ నాడు ఆ ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేయకూడదు, హోలీ వేడుకలు జరుపుకోకూడదు. ఆ మేరకు ఆ ప్రాంతం అంతా బ్యానర్లు ఏర్పాటు చేసామని బోల్‌పూర్ డివిజన్ అటవీ అధికారి రాహుల్ కుమార్ ప్రకటించారు. అసలు ఆ ప్రాంతంలో ఎలాంటి వీడియోలూ చిత్రీకరించవద్దని కూడా ఆదేశించారు. నిషేధాజ్ఞలు సరిగ్గా అమలయ్యేలా చూసేందుకు పోలీసు వారి సహకారం తీసుకుంటామని రాహుల్ కుమార్ చెప్పారు.
విశ్వభారతి అధికార ప్రతినిధి కూడా ఆ ఆదేశాలను నిర్ధారించారు. శాంతినికేతన్ ఆశ్రమానికి యునెస్కో వారసత్వ సంపద స్థాయి ఉన్నందున ఆ ఆవరణలో హోలీ ఆడుకోడానికి ప్రజలను రానీయలేమని వెల్లడించారు.
హోలీ పండుగ రోజు ‘డోలా యాత్ర’ అనే ఊరేగింపు జరపడం బెంగాలీల సంప్రదాయం. సోనాఝూరీ ప్రాంతంలో అలాంటి ఊరేగింపు జరపడానికి వీలులేదని అటవీ అధికారి స్పష్టం చేసారు. ‘‘ఇది పచ్చటి చెట్లు ఉండే ప్రదేశం. వేల సంఖ్యలో ప్రజలు గుమిగూడి రంగునీళ్ళు చల్లుకుంటే చెట్లకు తీరని నష్టం వాటిల్లుతుంది. హోలీ వల్ల పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుంది. అలా జరగకుండా మనందరం ప్రతిజ్ఞ చేద్దాం’’ అని ప్రకటించారు.
సాధారణంగా విశ్వభారతిలో వసంతోత్సవాలు ఘనంగా నిర్వహించేవారు. విశ్వభారతికి యునెస్కో గుర్తింపు లభించాక 2019 నుంచీ అక్కడ వసంతోత్సవాలు జరపకూడదంటూ నిషేధం విధించారు. అప్పటినుంచీ సోనాఝూరీలో హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఇప్పుడు మొదటిసారి అక్కడ హోలీ వేడుకలు జరపకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు.
ఈ ఉత్తర్వులపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. హోలీ వేడుకలపై నిషేధం సోనాఝూరీ ఒక్కచోటనే విధించలేదని, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధించారనీ బీజేపీ నేత సువేందు అధికారి వెల్లడించారు. ‘‘ఇతర మతాల కార్యక్రమాలు ఉన్నప్పుడు పోలీసులు సమన్వయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ యేడాది మాత్రం హోలీ వేడుకల గురించి పోలీస్ స్టేషన్లలో సమావేశాలు జరిగాయి. ఇది రంజాన్ మాసం, హోలీ పండుగ శుక్రవారం వచ్చింది. కాబట్టి రంగులు వాడకూడదు అని బహిరంగంగానే చెబుతున్నారు. అసలు హోలీయే జరక్కుండా చూస్తున్నారు. శాంతినికేతన్‌లో ఉదయం 10గంటలకల్లా హోలీ వేడుకలు పూర్తయిపోవాలని బీర్‌భూమ్ ఎఎస్‌పి ఆదేశించారు. లేదంటే అరెస్టులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మమతా బెనర్జీ పాలనలో పోలీసులు ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.