ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్‌లో ఒక విద్యార్ధినిని లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కాన్పూర్ నగర ఏసీపీ మొహిసిన్ ఖాన్ మీద సస్పెన్షన్ వేటు పడింది. యూపీ డీజీపీ కార్యాలయం మొహిసిన్ ఖాన్‌ను సస్పెండ్ చేస్తూ నిన్న అంటే మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసింది.
బాధితురాలు గతవారం ఉత్తరప్రదేశ్ డిజిపికి లేఖ రాసింది. ఆ లేఖలో ‘‘నిందితుడు పోలీసు అధికారి అయినందున అతన్ని అరెస్ట్ చేయలేదు. శాఖాపరంగానూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అతని మీద ఛార్జిషీట్ దాఖలు చేయకుండా, అతన్ని అరెస్ట్ చేయకుండా నిందితుడు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. అతని దుశ్చర్యలు తన కెరీర్‌ను ప్రభావితం చేయడమే కాదు, తనను మానసికంగా డిప్రెషన్‌కు గురిచేసాయని వివరించింది. తదుపరి విచారణ మార్చి 20న ఉందనీ, ఆరోజు తన వాదనను బలంగా వినిపిస్తాననీ బాధితురాలు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొంది. మార్చి 20నాటి విచారణ తర్వాత నిందితుడి మీద విచారణ జరపాలా వద్దా అన్న విషయంపై అలహాబాద్ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది.
ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ నివేదిక రావడంతో దాన్ని కాన్పూర్ పోలీస్ కమిషనర్ బుధవారం నాడు రాష్ట్రప్రభుత్వానికి పంపించారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిందితుణ్ణి సస్పెండ్ చేసింది. అతన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. సస్పెన్షన్ లేఖ అధికారికంగా కాన్పూర్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరాక అతనిపై శాఖాపరమైన విచారణ మొదలవుతుంది. ఆ తర్వాతే అతనికి విధించాల్సిన శిక్ష ఖరారవుతుంది.
బాధితురాలు 2024 డిసెబర్ 12న కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఏసీపీ మొహిసిన్‌ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దాంతో కళ్యాణ్‌పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఆ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని, తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలనీ కోరుతూ మొహిసిన్ ఖాన్ డిసెంబర్ 16న హైకోర్టులో పిటిషన్ వేసాడు. బాధితురాలి ఫిర్యాదు తర్వాత ఏసీపీని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసారు. ఆ తర్వాత దర్యాప్తును సిట్‌కు అప్పగించారు.
ఒక ఐఐటీ విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మొహిసిన్ ఖాన్, పోలీసు వ్యవస్థలో ఏసీపీ స్థాయి అధికారి కావడం వల్లనే అతనిపై సస్పెన్షన్ వేటు వేయకుండా మూడు నెలలు జాప్యం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.