అశ్లీల నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్సైపై తాగుబోతులు దాడి చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
విజయనగరం జిల్లా వేపాడ మండలం, గుడివాడ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్.ఐ. బి.దేవిపై మద్యంమత్తులోని యువకులు దాడికి దిగారు.ఒకేసారి 9 మంది దాడికి దిగడంతో దేవి సమీపంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు. అయినా అక్కడా హంగామా చేశారు.
దాడి తరవాత యువకులు ఓ వైసీపీ నేత ఇంట్లో ఆశ్రయం పొందారు. ఎస్సై దేవీ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.