మూడు వేల కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు …!
మద్యం లావాదేవీలపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
కర్త, కర్మ, క్రియ అంటూ సంచలన ప్రకటన
అవసరమైతే మరిన్ని వివరాలు వెల్లడిస్తాననడం పై చర్చ
వైసీపీ పాలనలో జరిగిన మద్యం అమ్మకాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరుగుతుండగా వైసీపీ మాజీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం లావాదేవీల విషయంలో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డేనని అలియాస్ రాజ్ కసిరెడ్డి అని వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని సాయిరెడ్డి అన్నారు. కాకినాడ సెజ్ భూముల లావాదేవీలపై సిట్ విచారణకు హాజరై తిరిగి వెళుతూ మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు
వైసీపీ పాలనలో మద్యం సరఫరా ఆర్డర్లు, కంపెనీల యజమానుల నుంచి ముడుపులు వసూలు చేయడంలో కసిరెడ్డే కీలక వ్యక్తి అంటూ ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ, సిట్ దర్యాప్తులో ఇప్పటికే దీనికి సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. విజయసాయిరెడ్డే, రాజ్ కసిరెడ్డి పేరు చెప్పడంతో కసిరెడ్డితో జగన్ కు సంబంధాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజ్ కసిరెడ్డి దూరపు బంధువనే ప్రచారం ఉంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత విజయ సంబరాల్లో జగన్, సాయిరెడ్డి, కసిరెడ్డి ఉన్నారు. అందుకు సంబంధించిన ఓ ఫొటో, ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వైసీపీ హయాంలో రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారుగాను పనిచేశారు.
ఒక్కో మద్యం కేసుకు రూ.150 నుంచి రూ.450 వరకూ లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు కసిరెడ్డి పై ఉన్నాయి. మామూళ్ళు చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడంలో కీలకంగా మెలిగారని, నెలకు రూ.60 కోట్ల చొప్పున మొత్తం నాలుగేళ్ల రెండు నెలల కాలంలో రూ.3వేల కోట్లు దారి మళ్లించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
మద్యం కంపెనీల నుంచి కమిషన్ వసూలు చేసేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను కూడా కసిరెడ్డి ఏర్పాటు చేసినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి.హైదరాబాద్ కేంద్రంగా ఓ ఆఫీసు ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేసేవారని పలువురు ఆరోపిస్తున్నారు.
లంచాలు, మామూళ్ళుగా వసూలు చేసిన మొత్తాన్ని ప్రత్యేకంగా నియమించిన వ్యక్తుల ద్వారా ఓ చోట చేర్చేవారని, ఆ మొత్తాన్ని నాటి ప్రభుత్వం కీలకంగా మెలిగిన ఓ మంత్రి కుమారుడు వైట్ గా మార్చే వారిని చర్చ జరుగుతోంది. వైట్ గా మారిన తర్వాత ఆ మొత్తం కూడా ప్రభుత్వంలోని కీలక వ్యక్తి గా ఉన్న వద్దకు చేరేదట.
కూటమి ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తు కొలిక్కవస్తే ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో తెలుస్తుంది. ప్రస్తుతమైతే వైసీపీ పాలనలో జరిగిన మద్యం అమ్మకాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.