పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు పరిసర ప్రాంతాల్లో తాబేళ్ళ స్మగ్లింగ్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కొల్లేరు చుట్టుపక్కల గ్రామాల్లో వందల మంది తాబేళ్ళను వేటాడడం, వాటిని స్మగుల్ చేయడాన్ని జీవనోపాధిగా మార్చుకున్నారనే సంగతి ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ ప్రాంతంలో తాబేళ్ళ జాడ లేకుండా పోవడానికి ఇంకెంతో కాలం పట్టదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
గోదావరీ పరీవాహక ప్రాంతంలోని కొల్లేరు సరస్సు జీవ వైవిధ్యానికి ఆలవాలం. కొల్లేరు, కలిదిండి, మండవల్లి, పెదపాడు, కైకలూరు, ఏలూరు, ఆకివీడు మండలాల్లో జలావాసాలు ఎక్కువ. అందువల్ల నీటినే ఆశ్రయించి బతికే జీవరాశులూ ఎక్కువే. వాటినే లక్ష్యంగా చేసుకున్నారు కొంతమంది అక్రమార్కులు. తాబేళ్ళను వేటాడి, వాటిని వ్యానుల్లో బైట రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేళ్ళను వేటాడడం నిషిద్ధం, నేరం. తాబేళ్ళను వేటాడినా, వాటిని రవాణా చేసినా గరిష్ఠంగా ఏడేళ్ళ వరకూ జైలుశిక్ష, గరిష్ఠంగా రూ.10వేల వరకూ జరిమానా విధిస్తారు. ఆ విషయం గురించి జనాలకు పెద్దగా అవగాహన లేదు, ప్రభుత్వాలూ పెద్దగా ప్రచారం చేసింది లేదు. అయితే ఇటీవలి కాలంలో తాబేళ్ళను పెద్దసంఖ్యలో పట్టుకుని వాటిని అక్రమ రవాణా చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ మధ్యనే భద్రాచలం దగ్గర అధికారులు పెద్దసంఖ్యలో తాబేళ్ళను పట్టుకున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్‌లోని మండవల్లి నుంచి ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నారని తెలిసింది.
తాబేళ్ళ అక్రమ రవాణా కోసం కొల్లేరు పరిసర ప్రాంతాల నుంచి చెయిన్ వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. చేపల చెరువులు, సాధారణ చెరువులు, ఇతరత్రా జలాశయాల్లో లభించే తాబేళ్ళను సేకరిస్తారు. వాటిని కొనుగోలు చేసే అంతర్రాష్ట్ర ముఠాలు నిర్మానుష్య ప్రదేశాల్లో దాచిపెడతాయి. పెద్దసంఖ్యలో తాబేళ్ళు పోగయ్యాక వాటిని చేపల వ్యానుల్లో ట్రేల మాటున , లేదా మూటలు కట్టి సంచుల్లోనూ సరిహద్దులు దాటించేస్తున్నారు.
తాబేళ్ళను జలావాసాల నుంచి సేకరించేవారు కేజీ రూ.10 నుంచి రూ.20 వరకూ విక్రయిస్తున్నారు. వారి దగ్గర నుంచి తాబేళ్ళను కొనుగోలు చేసేవారు అంతర్రాష్ట్ర స్మగ్లర్లకు కేజీ రూ.100 నుంచి రూ.200 వరకూ విక్రయిస్తారు. వారు ఇవే తాబేళ్ళను ఛత్తీస్‌గఢ్, ఒడిషా, అస్సాం, గోవా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఆ ప్రాంతాల్లో తాబేలు మాంసానికి డిమాండ్ ఎక్కువ. అందుకే అక్కడి వ్యాపారులు రూ.500 నుంచి రూ.600కు మార్కెట్లో విక్రయిస్తారు.