అమరావతి రాజధానిలో 31 సంస్థలకు కేటాయించిన 629 ఎకరాల భూ కేటాయింపులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 13 సంస్థలకు కేటాయించిన 177 ఎకరాలను రద్దు చేశారు. భూ కేటాయింపు చేసిన సంస్థలు రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని షరతు విధించారు. 2014 నుంచి 2019 వరకు అమరావతిలో చేసిన భూ కేటాయింపులను ప్రభుత్వం మరలా సమీక్షిస్తోంది.భూ కేటాయింపుల సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పనిచేస్తోంది.
మూడుసార్లు సమావేశమైన ఉపసంఘం సూచనల మేరకు 31 సంస్థలకు భూ కేటాయింపులను పొడిగించారు. 13 సంస్థలకు రద్దు చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 130 సంస్థలకు 1277 ఎకరాలు కేటాయించారు. ఇందులో 69 ప్రభుత్వరంగం సంస్థలున్నాయి. 61 ప్రవేటు సంస్థలకు భూములు కేటాయించారు.
గతంలో అమరావతి రాజధానిలో రెండు కేంద్రీయ విద్యాలయాలకు ఒక దానికి 5 ఎకరాలు, మరోదానికి 8 ఎకరాలు కేటాయించారు. ఎకరా రూపాయి చొప్పున లీజుకు 60 సంవత్సరాలకు కేటాయించారు. ప్రస్తుతం ఒక కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు కేటాయించారు.
అమరావతిలో భూ కేటాయింపులకు ఉపసంఘం అనుమతించిన సంస్థలు 30 రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరవాత 2027 మార్చి చివరి నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలి. ఇప్పటికే అమరావతిలో మూడు యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి. విట్, అమృతా, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సీటీలు పనిచేస్తున్నాయి. ఎస్ఆర్ఎం విస్తరణకు సీఆర్డీఏ మరో 50 ఎకరాలు కేటాయించింది.
తాజాగా భూ కేటాయింపులు పొందిన సంస్థల్లో ఎక్కువగా హోటళ్లు, రిసార్టులతోపాటు, విదేశాంగశాఖకు 2 ఎకరాలు ఇండ్ రాయల్ హాటల్స్‌కు 4 ఎకరాలు కేటాయించారు. ఇలా మొత్తం 11 సంస్థలకు 54 ఎకరాలు కేటాయించారు. 19 సంస్థలకు 570 ఎకరాలు కేటాయించారు. వాటి నిర్మాణ గడువు పొడిగించారు. గతంలో ఆంధ్రాబ్యాంకుకు కేటాయించిన భూములను రద్దుచేశారు. ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడంతో భూములు రద్దు చేశారు. బీఆర్ శెట్టి మెడికల్ యూనివర్సీటీకి కేటాయించిన భూములను రద్దు చేశారు. సీఆర్డీయే అధికారులు ఎన్నిసార్లు లేఖలు రాసినా వారు స్పందించకపోవడంతో భూములు రద్దు చేశారు. తాజాగా భూములు తీసుకునే వారు రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.