భారతీయ రైల్వే సరికొత్త సంస్కరణలు, సాంకేతికతకు కేంద్రంగా మారుతోంది. డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ లోకోమోటివ్‌లకు సర్వీసులను మార్చిన రైల్వే శాఖ తాజాగా దేశంలోనే తొలి హైడ్రోజన్ సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమైంది.
హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో ఈ నెల 31 నాటికి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఓ నివేదికలో పేర్కొంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ ఈ రైలు డిజైన్‌ను రూపొందించింది.
రైలులో హైడ్రోజన్ సిలిండర్లను నిల్వ చేసేందుకు, ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు, ఎయిర్ రిజర్వాయర్‌లను ఉంచేందుకు మూడు ప్రత్యేక కోచ్‌లు ఏర్పాటు చేశారు. గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా అభివృద్ధి చేశారు.
‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’ పేరిట 35 సర్వీసులు నడపాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ఇందుకోసం ఒక్కో సర్వీసుకు రూ.80 కోట్లు ఖర్చు చేయనుంది. హెరిటేజ్, హిల్‌స్టేషన్స్ రూట్స్‌లో ఈ రైళ్లను నడపనుంది.