జనసేన పార్టీ ఈ నెల 14న నిర్వహించనున్న ఆవిర్భావ సభకు ఆ పార్టీ అధిష్టానం ‘జయకేతనం’గా నామకరణం చేసింది. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో జనసేన ముఖ్యనేత, మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. చిత్రాడ వద్ద జనసేన పార్టీ నిర్వహించే ‘జయకేతనం’ సభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోని పవన్ అభిమానులు ఈ సభకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరిగే ఈ సభ స్థానిక చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టబోతుందన్నారు.
పిఠాపురం ప్రాంతంలో విశేష సేవలందించిన మహానుభావులను స్మరించేలా సభా ద్వారాలకు పేర్లు పెట్టినట్లు వివరించారు. తొలి ద్వారానికి పిఠాపురం మహారాజు శ్రీ రాజా సూర్యరావు బహదూర్ , రెండో ద్వారానికి రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు సహాయం చేసిన దొక్కా సీతమ్మ పేరు పెట్టినట్లు తెలిపారు. మూడో ద్వారానికి విద్యాసంస్థలు స్థాపించి చరిత్ర సృష్టించిన మల్లాది సత్యలింగం నాయకర్ పేరు పెట్టినట్లు తెలిపారు.