మారిషస్ రాజధాని పోర్ట్ లూయీలో ఇవాళ జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తర్వాత ఆ దేశపు ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గులామ్‌తో కలిసి ‘అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నోవేషన్’ సంస్థను ఆవిష్కరించారు.
ఆ సంస్థ మారిషస్‌లో విద్య, అభ్యాసం, పరిశోధనలకు అత్యున్నత స్థాయి కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ఆ కేంద్రం విద్యాభ్యాసం, పరిశోధనలు, ప్రజాసేవకు కేంద్రస్థానంగా నిలవాలి. ఆ కేంద్రం భవిష్యత్తు కోసం కొత్త నాయకులను, కొత్త భవిష్యత్తునూ అభివృద్ధి చేయాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. దక్షిణ ప్రపంచపు దేశాల కోసం ‘మహాసాగర్’ – ‘మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్స్’ విజన్‌ను ప్రకటిస్తున్నామని చెప్పారు.
అంతకుముందు నిన్న, నరేంద్ర మోదీకి మారిషస్ ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ అవార్డు దక్కిన మొదటి భారతీయ నేత మోదీయే. అదే రోజు ఆయన మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రాంగులామ్, ఆయన భార్య వీణా రాంగులామ్లకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (దేశాంతర భారత పౌరసత్వ) కార్డులు ప్రదానం అందజేసారు. అదే రోజు, ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో సమావేశమైన మోదీ, ఆ దంపతులకు మహాకుంభమేళా నుంచి తీసుకువెళ్ళిన పవిత్ర గంగాజలాన్ని అందజేసారు. అధ్యక్షుడి భార్యకు వారణాసి చీరను కానుకగా ఇచ్చారు. అలాగే ప్రధానమంత్రి నవీన్ రాంగులామ్ తండ్రి పేరిట ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్లో ఒక మొక్క నాటారు.
ఇవాళ మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోదీ, ఇరుదేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకువెళ్ళాలని రెండు దేశాల ప్రధానమంత్రులూ నిర్ణయించామని చెప్పారు. మారిషస్ పార్లమెంటు నిర్మాణానికి భారత్ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇరుదేశాలనూ కలిపి ఉంచేది హిందూ మహాసముద్రం ఒకటే కాదు, సంస్కృతీ సంప్రదాయాలు కూడా అని మోదీ వ్యాఖ్యానించారు. ఆ వేడుకల్లో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఇంఫాల్ షిప్, హెలికాప్టర్ పాల్గొన్నాయి.