న్యాయస్థానంలో పోసానికి చుక్కెదురు
చెవిరెడ్డికి నోటీసులు
విశాఖలో కొడాలి నానిపై కేసు…
అధికారానికి దూరమైన తర్వాత నుంచి వైసీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది. పార్టీలో కీలకంగా మెలిగిన కొందరు నేతలు రాజకీయాల నుంచి వైదొలగగా మరికొందరు మరోపార్టీలో తమ భవిష్యత్ ను వెతుక్కునే పనిలో పడ్డారు. 2024లో ఓటమి తర్వాత నుంచి వైసీపీ కి దెబ్బదెబ్బమీద తగులుతోంది.
ఇటీవల కాలంలో వైసీపీ నేతలు కేసుల్లో చిక్కుకుని సతమతం అవుతున్నారు. లిక్కర్ అమ్మకాలపై సిట్ , కాకినాడ సెజ్ భూముల అమ్మకాల లావాదేవీలపై విచారణతో ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణ దోరణిలో పడ్డారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో రిమాండులో ఉండగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై విశాఖపట్టణంలో కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేశ్ పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదును క్వాష్ చేయాలని కోర్టులో కొడాలి నాని పిటిషన్ వేశారు. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కూడా రేషన్ బియ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పులివెందులకు చెందిన రవీందర్ రెడ్డి గతంలో చంద్రబాబు, పవన్ పై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు కేసులు నమోదు అయ్యాయి. కడప జైలులో ఉన్న రవీందర్ రెడ్డిని పీటీ వారెంట్ పై జగ్గయ్యపేట కోర్టులో ప్రవేశపెట్టారు.
వైసీపీకి చెందిన కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తాజాగా ఒంగోలు పోలీసులు నోటీసులు జారీ చేశారు. యర్రగొండపాలెం పోలీసులు 41 ఏ నోటీసులు జారీ చేశారు. ఆర్వోపై దురుసుగా ప్రవర్తించిన కేసులో నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురుపై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలపై ఏపీలో పలు చోట్లు కేసులు నమోదు అయ్యాయి. పీటీ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంటును కొట్టివేయాలని హైకోర్టును పోసాని ఆశ్రయించారు. ఆయన వినతిని ఉన్నత న్యాయస్థానం తిరస్కరిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.