కలియుగదైవం కొలువైన తిరుమల మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. నిత్యం లక్షలాది భక్తుల రాకతో నిత్యం కళ్యాణం-పచ్చ తోరణంలా ఉండే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కానుకల విలువ రోజుకు కోటిరూపాయల మార్క్ దాటుతోంది. తాజాగా టీటీడీ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు కూడా విరాళాల్లో రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకు సదరు సంస్థకు రూ. 2200 కోట్ల విరాళాలు అందాయి.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు 1985లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వ్యవస్థే 2014 లో శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ గా రూపాంతరం చెందింది. ప్రారంభంలో రెండువేల మందితో ప్రారంభమై నేడు రోజుకు లక్ష మంది భక్తులకు అన్నవితరణ చేసే స్థాయికి ట్రస్టు ఎదిగింది. ఈ సంస్థకు 9.7 లక్షల మంది దాతలు విరాళలు అందించగా కోటి రూపాయలు అంతకు మించ ఇచ్చిన దాతలు 139 మంది ఉన్నట్లు లెక్కల ద్వారా తెలిసింది.
తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలు. ఇంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చిన దాతలు 249 మంది ఉన్నారు. వెంగమాంబ అన్నప్రసాదకేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం అల్పాహారం కోసం 10 లక్షల రూపాయలు, మధ్యాహ్నం భోజనం కోసం 17 లక్షల రూపాయలు, రాత్రి భోజనం కోసం 17 లక్షల రూపాయలును భక్తులు చెల్లించవచ్చు. అంతమొత్తాన్ని చెల్లించే భక్తుల పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అలాగే దాతలే స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించవచ్చు అని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోజనం మెనూలో శెనగ వడను చేర్చారు.