ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.35,104 కోట్ల వ్యయంతో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం కంటె ఆ వ్యయం 7.5శాతం అధికం. మొత్తం మూలధన వ్యయం 7,773 కోట్లు. అది గత ఆర్థిక సంవత్సరపు మూలధన వ్యయం కంటె 9శాతం ఎక్కువ.
మణిపూర్‌లోని సున్నితమైన ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు ఉద్యోగులకు ప్రోత్సాహకాల కోసం కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,866 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో అల్లర్ల వల్ల చెల్లాచెదురైన ప్రజలకు తాత్కాలిక పునరావాసం కల్పించేందుకు రూ.15కోట్లు, వారికి ఇళ్ళు నిర్మించి ఇవ్వడానికి రూ.35కోట్లు, పరిహారం చెల్లించడానికి రూ.7 కోట్లు, సహాయక చర్యల కోసం రూ.100 కోట్లు కేటాయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సామాజిక రంగాలకు రూ.9520 కోట్లు కేటాయించారు.
మణిపూర్‌లో ప్రధానమంత్రి పర్యటించడం లేదంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాల మీద నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు ఘాటుగా విరుచుకుపడ్డారు. 1993లో మణిపూర్‌లో అల్లర్లు జరిగి 750 మంది ప్రజల ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, నాటి కేంద్ర హోంమంత్రి ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని గుర్తు చేసారు.
‘‘1993 ఏప్రిల్-డిసెంబర్ నెలల మధ్యలో కుకీలు, నాగాల మధ్య పెద్దపెద్ద ఘర్షణలు చెలరేగేవి. అప్పుడు మణిపూర్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజ్‌కుమార్ ధీరేంద్ర సింగ్ అధికారంలో ఉండేవారు. అప్పుడు జరిగిన ఘర్షణల్లో 350 గ్రామాలు సర్వనాశనమైపోయాయి, 750 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. కేంద్ర హోంమంత్రి శంకర్‌రావు చవాన్. వాళ్ళు కనీసం పార్లమెంటులో మణిపూర్ అంశం మీద చర్చలో ఐనా పాల్గొనలేదు. అప్పుడు కాంగ్రెస్ ఏమైపోయింది? వాళ్ళను పార్లమెంటులో మాట్లాడమని అడిగారా? వాళ్ళను మణిపూర్ వెళ్ళమని డిమాండ్ చేసారా? లేదు’’ అని నిర్మల గుర్తు చేసారు. అలాంటిది ఇప్పటి ప్రధానమంత్రిని మణిపూర్ వెళ్ళాలంటూ ఎలా డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు.