తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ మొదలయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ ప్రజలే కేంద్రంగా తమ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు అన్నివిధాలా సహకరిస్తామని… రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామనీ గవర్నర్ చెప్పుకొచ్చారు. రైతులకు రుణమాఫీ చేయడం తమ ప్రభుత్వపు చిత్తశుద్ధికి నిదర్శనమని జిష్ణుదేవ్ అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పించామని గుర్తు చేసుకున్నారు. గతేడాది 55వేల మందికి పైగా యువతరం ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పుకున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిల్లు ప్రతిపాదించామన్నారు. ఈ సమావేశాల్లోనే ఎస్సీ ఉపవర్గీకరణ కోసం బిల్లు పెడతామని చెప్పారు.
గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ఎంఎల్ఎలు సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత శాసనసభ గురువారానికి వాయిదా పడింది.