నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహిళల సంఖ్య సుమారు 75కు చేరుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలకు లబ్ధి కలిగించాలన్న ఉద్దేశంతోనే చేసామని చెప్పారు. మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే మొదలైందని చంద్రబాబు చెప్పారు.
ఇవాళ శాసనసభలో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు మహిళల కోసం తమ పార్టీ ఎన్నో పనులు చేసిందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రత్యర్థి వైఎస్ జగన్ను దుయ్యబట్టారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేసారు. ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి లాక్కోడానికి కోర్టుకెక్కారంటూ జగన్ను చంద్రబాబు విమర్శించారు. డ్వాక్రా సంఘాల మద్దతుతో రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని ఇంకా బతికుందంటే దానికి కారణం మహిళలు చూపిన చొరవేనంటూ సీఎం వారిని కొనియాడారు.
ప్రతీ కుటుంబంలోనూ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లఖ్పత్ దీదీ పథకాన్ని రాష్ట్రంలో సమగ్రంగా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడం రాష్ట్రాభివృద్ధికి లాభదాయకం కాగలదని సీఎం వ్యాఖ్యానించారు.