ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నెమలి వేణుగోపాల స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ 68వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 12 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా నెమలి కృష్ణుడిని తమ ఇలవేల్పుగా భావిస్తూ ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు నెమలి కృష్ణుడి కళ్యాణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13న సాయంత్రం శేషవాహన మహోత్సవం, రాత్రికి ఎదురుకోల ఉత్సవం నిర్వహిస్తారు. మార్చి 14న రాత్రి 10 గంటలకు రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తలు తరలివస్తారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15న రథోత్సవం, 16న ఉదయం వసంతోత్సవం, సాయంత్రం పల్లకీ ఉత్సవం, రాత్రి కోనేరులో తెప్పోత్సవం సేవలు నిర్వహిస్తారు. మార్చి 17న ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో 1953 మార్చి 23న( ఆరోజు శ్రీరామనవమి) వేణుగోపాలస్వామి స్వయంభువుగా ప్రత్యక్షమయ్యారు. వనమా సీతారామయ్య అనే వ్యక్తి తన పొలానికి సారవంతమైన మట్టి కోసం దారా నర్సయ్యకు చెందిన భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిలో తన వద్ద పనిచేసే కఠారు వెంకటేశ్వర్లుతో మట్టి తవ్విస్తుండగా స్వామి విగ్రహం లభ్యమైంది. వేదపండితుల ఆధ్వర్యంలో 1957 ఫిబ్రవరి 6న ప్రతిష్ఠించారు.