ఆంధ్రప్రదేశ్‌లో అరకు కాఫీకి విస్తృత ప్రజాదరణ ఉంది. ఉత్తరాంధ్రలోని అటవీ ప్రాంతాల్లో గిరిజనులు పండించే కాఫీ గింజల నాణ్యత బాగుండడంతో ఆ కాఫీకి రాష్ట్రప్రభుత్వం ప్రాచుర్యం కల్పిస్తోంది. పైగా ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కూడా పలుమార్లు అరకు కాఫీ గురించి ప్రస్తావించడం దానికి గొప్ప ప్రచారంగా నిలిచింది. తాజా పార్లమెంటు సమావేశాల్లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు స్పీకర్ ఒప్పుకున్నారు.
తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంలో మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు నిన్న పార్లమెంటు స్పీకర్‌ను కలిసినప్పుడు అరకు కాఫీ ప్రస్తావన చేసారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీపీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తదితరులు లోక్‌సభ స్పీకర్‌కు అరకు కాఫీ గురించి వివరించారు. అరకు కాఫీ రుచిని ఎంపీలకు చూపించడానికి, పార్లమెంటులో ప్రత్యేక ప్రచారం నిర్వహించడానికీ అనుమతి ఇవ్వాలని కోరారు.
‘‘ప్రధాని నరేంద్ర మోదీ తన మన్‌కీ బాత్‌లో పలుమార్లు అరకు కాఫీ గురించి చెప్పడంతో దాని ప్రాశస్త్యం పెరిగింది. పార్లమెంటులో దాని స్టాల్ ఏర్పాటు చేస్తే ఎంపీలు, పార్లమెంటుకు వచ్చే విశిష్ట అతిథులకు దాని రుచిని పరిచయం చేయవచ్చు. మొదట ఈ సమావేశాల్లో స్టాల్ ఏర్పాటుకు అనుమతించండి. తర్వాతి కాలంలో శాశ్వత స్టాల్ ఏర్పాటు చేసుకోడానికి అనుమతించండి’’ అని పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లాను కోరారు.
తెలుగు ఎంపీల విజ్ఞప్తికి పార్లమెంటు స్థాయీ సంఘం సానుకూలంగా స్పందించింది. పార్లమెంటు ఆవరణలో ప్రస్తుత సమావేశాల్లోనే స్టాల్ ఏర్పాటుకు అనుమతించారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు.