కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో ఎన్డీయే పాలకపక్షంగా ఉన్నచోట అభివృద్ధి పరుగులు పెడుతుంది. అందుకు ప్రత్యేక నమూనాగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రధాని మోదీ తరుచూ చెప్పే డబుల్ ఇంజిన్ సర్కార్ డైలాగ్ ఏపీకి ఇట్టే సరిపోతుంది.
ఏపీలో నిర్మించే పోలవరం జలాశయం అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ. 5 వేల కోట్లు ముందస్తుగా చెల్లించింది. గతంలో రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేసి అందుకు తగిన బిల్లులు సమర్పిస్తే వాటిని పరిశీలించి కేంద్రం చెల్లింపులు చేసేది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉండటంతో ఇది సాధ్యమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం తాజాగా రూ.2,705 కోట్లు ముందస్తుగా చెల్లించింది. త్వరలోనే నిధులు రాష్ట్రప్రభుత్వానికి, అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాలో జమకానున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ నిధులతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.5,512 కోట్లు కేటాయించినట్లు లెక్కలు తేలాయి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు మంజూరు చేయలేదు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.12,157 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. తర్వాత రూ.2,807 కోట్లు కేటాయించింది. ఇందులో పాత బిల్లుల రీయింబర్స్‌మెంట్‌తోపాటు ముందస్తు నిధులు కూడా ఉన్నాయి. తాజాగా పోలవరానికి రూ.2,700 కోట్లు నిధులు మంజూరు చేసే ఫైలు ముందుకు కదలింది.
ప్రాజెక్టు నిర్మాణ పనులు 2024 నవంబరు 30 నాటికి +45.72 మీటర్ల లెక్క ప్రకారం 53.46 శాతం పూర్తి అయినట్లు పార్లమెంటరీ స్థాయీసంఘం మంగళవారం లోక్ సభకు అందజేసిన నివేదికలో పేర్కొంది. నిర్మాణ పనులు 76.79శాతం, భూసేకరణ, సహాయ, పునరావాస పనులు 22.58 శాతం పూర్తి చేసినట్లు వివరించింది.
ప్రాజెక్టు నిర్మాణాన్ని 2026 మార్చి వరకు పూర్తి చేయాలని తొలుత షెడ్యూల్లో పేర్కొన్నప్పటికీ పలు సాంకేతిక సవాళ్ళు ఎదురవుతున్నాయి. దీంతో ప్రాజెక్టు గడువును మరో ఏడాది గడువు పొడిగించారు.