జమ్మూకశ్మీర్ కేంద్రంగా కుట్రలు, కుతాంత్రాలకు పాల్పడుతున్న రెండు సంస్థలపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం – 1967 మేరకు ఈ చర్యలు చేపట్టింది. ఆవామీ యాక్షన్ కమిటీ (AAC), జమ్మూకశ్మీర్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (JKIM) గ్రూపులను ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఉమర్ ఫరూక్ నేతృత్వం AAC కార్యకలాపాలు సాగిస్తుండగా జమ్మూకశ్మీర్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ సంస్థకు మస్రూర్ అబ్బాస్ అన్సారీ నేతృత్వం వహిస్తున్నాడు.
ఈ రెండు సంస్థలకు చెందిన సభ్యులు జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇస్తున్నారని భారత ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. భారత దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు హాని కలిగించే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. దేశ భద్రత దృష్ట్యా ఈ రెండు సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించాలని నిర్ణయించినట్లు కేంద్రం వివరించింది.