దేశంలో ఇప్పుడు ఎంపీ స్థానాల విషయం హాట్ టాపిక్‌గా ఉంది. జనాభా తక్కువ ఉంటే ఎంపీ సీట్లు తగ్గుతాయనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం తాను అలా అనుకోవడం లేదని చెప్పారు. ముందు దేశం ముఖ్యం, తర్వాతే రాష్ట్రం ముఖ్యం అని చంద్రబాబు స్పష్టం చేసారు. ‘పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్’ అనే అంశంపై అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నిర్వహించిన సదస్సులో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని, కీలకోపన్యాసం చేసారు. దక్షిణాది రాష్ట్రాలు మేలుకొనవలసిన సమయం వచ్చిందని, జనాభా పెరుగుదల గురించి ఆలోచించాలనీ సీఎం అన్నారు.
ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల వల్ల మన దేశానికి జనాభాకు ఇబ్బంది లేకుండా పోయిందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ప్రపంచంలో పేరెన్నిక గన్న దేశాలు సైతం ఇప్పుడు మానవ వనరుల కోసం భారతీయుల వైపే చూస్తున్నాయని చంద్రబాబు గమనించారు. ప్రపంచంలోని ఏ కంపెనీ అయినా భారతీయులే నడిపించాలని ఆయన ఆశించారు. జనాభా పెరుగుదల మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాలని సీఎం అభిప్రాయపడ్డారు.
గతంలో ఇద్దరికంటె ఎక్కువమంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ చట్టాన్ని తానే చేసానని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. అయితే ఆ చట్టాన్ని ఇప్పుడు తీసేసానని బాబు చెప్పారు. ఎక్కువమంది పిల్లలను కనాలని తానే చెబుతున్నానంటూ సమాజానికి పిలుపునిచ్చారు. అదే సమయంలో, టోటల్ ఫెర్టిలిటీ రేట్ ప్రస్తుతం 1.5 ఉందని, దాన్ని 2.1కి పెంచాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఏదైనా ఒక విషయం కొత్తగా తెలిస్తే దాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేయడం ఆంధ్రా వారికి అలవాటు అని చంద్రబాబు నాయుడు సగటు ప్రజలను మునగ చెట్టు ఎక్కించారు. శిశు మరణాల విషయంలో దేశ సగటు కంటె ఆంధ్రప్రదేశ్ సగటు తక్కువగా ఉందని సంతోషించాలంటూ జ్ఞానబోధ చేసారు. ఇంక డెలివరీల విషయానికి వస్తే సాధారణ కాన్పుల సంఖ్య పెరగాలని, సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలనీ చంద్రబాబు అన్నారు. శిశు మరణాల విషయానికి వస్తే దేశ సగటులో సగమే ఉన్నందున తక్కువగా ఉంది అని నిపుణులు చెప్పారు.
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు.
ఆ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోకెల్లా మన దేశంలోని కుటుంబ వ్యవస్థ గొప్పదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేసారు.