కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ఈ మధ్యాహ్నం చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి. బీజేపీ లక్ష్యంగా దాడి చేయడానికి తమ పార్టీ సిద్ధపడి వచ్చిందని చెప్పే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార పక్ష ఎంపీలు భగ్గుమన్నారు. ఖర్గే వాడిన ఒక పదం సభాధ్యక్షుణ్ణి అవమానించేలా ఉందని విరుచుకుపడ్డారు. తన తప్పు గ్రహించిన మల్లికార్జున ఖర్గే వెంటనే క్షమాపణలు చెప్పారు.
మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను మొదట బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు క్షమించడానికి అనర్హమని వ్యాఖ్యానించారు. ఆ పదాలను రికార్డులలోనుంచి తొలగించాలని, ఖర్గే క్షమాపణలు చెప్పాలనీ డిమాండ్ చేసారు.
మల్లికార్జున ఖర్గే వెంటనే దానికి ఒప్పుకున్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు. క్షమాపణలు కూడా చెప్పారు. ‘‘నన్ను మన్నించండి. నేను సభాధ్యక్షుణ్ణి ఉద్దేశించి ఆ మాటలు అనలేదు. నేను ప్రభుత్వ విధానాల గురించి మాత్రమే మాట్లాడాను. నా వ్యాఖ్యలతో మీ మనోభావాలు గాయపడి ఉంటే మన్నించండి. క్షమాపణలు చెబుతున్నాను’’ అని చెప్పారు.
సోమవారం నాడు పార్లమెంటులో జరిగిన రగడకు కొనసాగింపుగా ఇవాళ కూడా ఉభయ సభల్లోనూ గొడవ జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా సూత్రం అంశాల మీద డిఎంకె రచ్చరచ్చ చేసింది. ప్రత్యేకించి, నూతన విద్యావిధానం పేరుతో తమ మీద హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారంటూ డిఎంకె, ఎండిఎంకె పార్టీల ఎంపీలు కేంద్రప్రభుత్వం మీద విరుచుకు పడ్డారు. వారికి కాంగ్రెస్ ఎంపీలు మద్దతు పలికారు.
తమిళనాడు గురించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొన్ని వ్యాఖ్యలు చేసారు. వాటిపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. ధర్మేంద్ర ప్రధాన్ తనను తాను రాజులా భావించుకుంటున్నారని మండిపడింది. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ డీఎంకే ఎంపీలు పార్లమెంటు లోపలా, బైటా ఆందోళనలు చేపట్టారు. పార్టీ సీనియర్ నాయకురాలైన కనిమొళి విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టారు.
ఖర్గే రాజ్యసభలో ఇవాళ్టి తన ప్రసంగంలో ప్రధాన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘‘ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు ఈ దేశంలోని ఒక వర్గానికి చెందిన వ్యక్తుల ఆత్మగౌరవాన్ని నిందిస్తున్నాయి’’ అన్నారు. ‘‘వాళ్ళు దేశాన్ని విడగొట్టడం గురించి మాట్లాడుతున్నారు.. ముక్కలు చేయడం గురించి మాట్లాడుతున్నారు.. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి’’ అని మండిపడ్డారు.
డీఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే, తమ మిత్రపక్షం మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. అవి తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని విరుచుకుపడ్డారు. తమిళ ప్రజల హక్కులనూ, ఆత్మగౌరవాన్నీ నిర్లక్ష్యం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ద్వితీయార్థంలో నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారన్న ప్రచారమూ ఉభయ సభల్లో ప్రతిపక్షాల గొడవలకు కారణంగా నిలుస్తున్నాయి. డీలిమిటేషన్ ద్వారా దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారనీ, హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనీ డీఎంకే కేంద్ర ప్రభుత్వంపై రచ్చ చేస్తోంది. ఆ ఆరోపణలను కేంద్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతవారం తమిళనాడులో పర్యటించినప్పుడు, ఆ రాష్ట్రం డీలిమిటేషన్ వల్ల ఒక్క ఎంపీ సీటునైనా కోల్పోదని స్పష్టం చేసారు. ఇక నూతన విద్యావిధానం ద్వారా హిందీని రుద్దుతున్నారన్న అపోహలను ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టంగా తోసిపుచ్చారు. మాతృభాష, ఇంగ్లిష్‌తో పాటు మరొక భాష నేర్చుకోవాలన్నదే లక్ష్యమనీ, అది హిందీయే అవాల్సిన అవసరం లేదనీ వివరించారు. త్రిభాషా సూత్రం వల్ల విద్యార్ధులు మరొక భాషను నేర్చుకోగలుగుతారని చెప్పారు.
కానీ ఆ వివరణలను తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె సుప్రిమో స్టాలిన్ ఒప్పుకోవడం లేదు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోవని అమిత్ షా చెప్పారు కానీ ఉత్తరాదిలో సీట్లు పెరగబోవని చెప్పలేదు కదా అని కోడిగుడ్డు మీద ఈకలు పీకారు. అలాగే హిందీ భాష విషయంలోనూ ధర్మేంద్ర ప్రధాన్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేయని రాష్ట్రాలకు నిధులు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.