బలోచిస్థాన్‌లో వేర్పాటు వాదులు రైలును హైజాక్ చేసినట్లు ప్రకటించారు. వందమందిని బందీలుగా తీసుకున్నారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న రైలును హైజాక్ చేశారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై వేర్పాటువాదులు కాల్పులకు తెగబడినట్లు ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ తెలిపారు.
రైలును హైజాక్ చేసినట్లు వేర్పాటువాద గ్రూపు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది.హైజాక్ విషయం తెలియగానే స్థానిక పోలీసులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. బందీల్లో పాక్ రక్షణ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం ట్రాక్‌ను పేల్చివేయడంతో రైలు నిలిచిపోయింది.
బలూచిస్థాన్ వేర్పాటు వాదుల కాల్పుల్లో ఆరుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం మిలటరీ ఆపరేషన్ చేపడితే ప్రయాణీకులను చంపేస్తామని వేర్పాటువాదులు బెదిరింపులకు దిగారు.
2000 సంవత్సరం నుంచి బలూచిస్థాన్ వేర్పాటు వాదులు ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తున్నారు. బలూచిస్థాన్ ప్రాంతంలో రైల్వే లైన్లు పేల్చివేయడం, జాతీయ రహదారులపై బస్సులను ఆపి, ప్రజల స్థానికతను గుర్తించి చంపివేయడం చేస్తున్నారు. పాకిస్థాన్, అమెరికా బీఎల్వోను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.