కాలుష్య నగరాల జాబితాలో భారత్ తన పాత రికార్డును కొనసాగించింది. తాజాగా స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ, ఐక్యూ ఎయిర్ సంస్థ విడుదల చేసిన జాబితాలో భారత నగరాలే అధికంగా ఉన్నాయి. ద ఎయిర్ క్వాలిటీ రిపోర్టు 2024 పేరుతో ఐక్యూ విడుదల చేసిన 20 నగరాల జాబితాలో 13 నగరాలు మన దేశం నుంచే స్థానం పొందాయి.
అస్సాంలోని బైర్నిహాట్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరవాత ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా తన ర్యాంకు నిలబెట్టుకుంది. తరవాత న్యూఢిల్లీ, ముల్లన్‌పూర్, ఫరీదాబాద్, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నొయిడా, బివాడి, ముజఫర్‌నగర్, నొయిడా, హనుమాన్‌గఢ్ ఉన్నాయి.
2023 రిపోర్టులో ప్రపంచంలో అంత్యంత కాలుష్య దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. తాజా నివేదికలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. ఏటా దేశంలో గాలి కాలుష్యం భారిన పడి 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని లాన్సెట్ నివేదిక విడుదల చేసింది. వాయు కాలుష్యం వల్ల దేశంలో ప్రతి వ్యక్తి 5.2 సంవత్సరాల జీవిత కాలాన్ని కోల్పోతున్నారన్న వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కాలుష్య నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేసిన సౌమ్య స్వామినాథన్ పలు సూచనలు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వంటకు వంటచెరకు ఉపయోగించడం వల్ల వ్యాధుల భారిన పడుతున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగం పెంచేందుకు పేదలకు రాయితీలు పెంచాలన్నారు. కాలుష్యం వెదజల్లే వాహనాల లైసెన్సులు రద్దు చేయాలన్నారు.
కాలుష్యం తగ్గించేందుకు కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందని సౌమ్య స్వామినాథన్ గుర్తుచేశారు. ముఖ్యంగా పట్టణాల్లో ప్రజా రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలన్నారు. కాలం చెల్లిన వాహనాలను కట్టడి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో బయోగ్యాస్ అందించాలని సూచించారు. పట్టణాల, నగరాల నుంచి వస్తోన్న టన్నుల కొద్దీ చెత్తను కాల్చివేయడం వల్ల వాయు కాలుష్యం మరింత పెరుగుతోందన్నారు. పంటల సాగు తరవాత మిగిలిన వ్యర్థాలకు నిప్పుపెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాలని సౌమ్య స్వామినాథన్ సూచనలు చేశారు.