అభినవ అన్నమయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఉదయం తిరుపతి భవానీనగర్‌లోని గరిమెళ్ళ నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించారు. నగరంలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేసారు.
బాలకృష్ణ ప్రసాద్ మార్చి 9 రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ఆయన ఇద్దరు కుమారులూ అమెరికా నుంచి బయల్దేరి భారత్ వచ్చారు, సోమవారానికి తిరుపతిలోని స్వగృహానికి చేరుకున్నారు. దాంతో మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.
తన గానామృతంతో అనునిత్యం తిరుమల వేంకటేశ్వరుణ్ణి, స్వామి భక్తులను అలరింపజేసిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో సంగీతాభిమానులు పాల్గొన్నారు. గరిమెళ్ళ కుటుంబానికి తమ సంతాపం తెలియజేసారు.