అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పాకిస్థాన్ రాయబారిని వెనక్కు పంపడం చర్చనీయాంశమైంది. తుర్కిమెనిస్థాన్‌లోని పాక్ రాయబారి ఎసాన్‌ను అమెరికా తిప్పిపంపింది. లాస్‌ఏంజెలెస్ విమానాశ్రయంలో దిగిన ఎసాన్‌ను భద్రతా అధికారులు వెనక్కు పంపించారు. ఎసాన్ పాస్‌పోర్టులో వివాదాస్పద ప్రస్తావనలు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఆయనకు అమెరికాలో ప్రవేశం కల్పించలేదు. ఇప్పటికే పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు వెళ్లవద్దంటూ అమెరికా పౌరులను హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేశారు. దీని ద్వారా అమెరికాలో ప్రవేశించిన విదేశీయుల వల్ల జాతీయ భద్రతకు భంగం వాటిల్లకుండా రక్షణ ఉంటుంది. ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా నిషేధం విధించే జాబితాలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయని తెలుస్తోంది.