ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ వెళ్ళారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఉదయం 6గంటలకు ఆయన పోర్ట్ లూయీస్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మోదీకి మారిషస్ ప్రభుత్వం సైనిక లాంఛనాలతో ఘనస్వాగతం పలికింది.
మారిషస్ ప్రభుత్వంలోని ఉద్దండులంతా ఉదయం 6 గంటలకే విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నారు. ఆ దేశపు ప్రధానమంత్రి నవీన్ రాంగూలమ్ భారత ప్రధానిని పుష్పమాలతో సత్కరించారు. మారిషస్ ప్రధానమంత్రితో పాటు ఉప ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, మారిషస్ జాతీయ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నేత, విదేశాంగ మంత్రి, క్యాబినెట్ కార్యదర్శి, ఎంపిలు, ఎమ్మెల్యేలు, దౌత్యవేత్తలు, మతగురువులు తదితరులు మొత్తం 200 మంది భారత ప్రధానికి స్వాగతం పలికారు.
నరేంద్ర మోదీ భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మారిషస్‌కు పయనమయ్యారు. ఆయన మార్చి 12న జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
మోదీ పర్యటన భారత-మారిషస్ సంబంధాలను బలోపేతం చేసే దిశగా గొప్ప ముందడుగు అని భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ‘‘రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ప్రధాని మోదీ మారిషస్‌లోని పోర్ట్ లూయిస్ చేరుకున్నారు. ఆయన పర్యటన ఇరు దేశాల సంబంధాలనూ మరింత బలోపేతం చేస్తుంది. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మారిషస్ దేశ నాయకత్వంతోనూ, ఇతర ప్రముఖులతోనూ మోదీ సమావేశాల్లో పాల్గొంటారు’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ సామాజిక మాధ్యమంలో ట్వీట్ చేసారు.
మారిషస్‌లోని ప్రవాస భారతీయులు కూడా మోదీని చూడడం కోసం పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ మోదీ అభివాదం చేసారు. ఇరుదేశాల మధ్యా సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర వహిస్తున్నారంటూ వారిని అభినందించారు.