అక్రమంగా అమెరికాలో చొరబడుతున్న వారిని ఆ దేశ యంత్రాంగం వెనక్కి పంపుతోంది. అనధికారికంగా తమ దేశంలో ఉంటున్న పలువురు భారతీయులను యుద్ధవిమానాల్లో ట్రంప్ ప్రభుత్వం స్వదేశానికి పంపింది.
అగ్రరాజ్యం కఠినంగా వ్యవహరిస్తున్నా, డంకీ మార్గంలో అమెరికా వెళ్ళవద్దని భారత ప్రభుత్వం సూచిస్తున్నా కొందరు మాత్రం తీరు మార్చుకోవడంలేదు.
గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో డంకీ మార్గంలో అమెరికా వెళ్తూ విషాదంలో కూరుకుపోయింది. కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్తూ మార్గమధ్యంలోనే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసింది. మృతుడిది గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలోని మోయద్ గ్రామంగా తేలింది. దిలీప్ పటేల్ అనే వ్యక్తి ఓ ఏజెంట్ ద్వారా అమెరికాకు పయనం అయ్యాడు. భార్య, చిన్నారితో సహా ముగ్గురిని అమెరికా పంపడానికి రూ.కోటి చెల్లించాలని ఏజెంట్ కోరడంతో తమ భూమిని విక్రయించి డబ్బు కట్టాడు.
రెండు నెలల కిందట టూరిస్ట్ వీసాపై దుబాయ్ వెళ్లి, అక్కడి నుంచి నికరాగ్వాకు వెళ్లాడు. అక్కడినుంచి డంకీ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో షుగర్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో సరైన చికిత్స అందకపోవడంతో కోమాలోకి వెళ్ళి చనిపోయాడు. మృతుడి భార్యాబిడ్డలు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు వార్తలొస్తున్నాయి.