కెనడా కొత్త ప్రధాని అభ్యర్థి ఎన్నిక పూర్తి అయింది. ట్రూడో వారసుడిగా ఆర్థికవేత్త మార్క్ కార్నీని ఎన్నుకుంటూ నిర్ణయం వెలువడింది. సోమవారం ఒట్టావాలో జరిగిన లిబరల్ పార్టీ సమావేశంలో మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీని ప్రధానిగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం సభ్యుల్లో ఆయనకు 85.9 శాతం మద్దతు లభించింది. త్వరలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మార్క్ కార్నీ ప్రముఖ ఆర్థిక వేత్త. ఆయన హార్వార్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డి చేశారు. బ్యాంక్ ఆఫ్ లండన్ అధిపతిగా ఏడేళ్లు సేవలు అందించారు. ఆయనకు లండన్, ఐర్లాండ్, కెనడా పౌరసత్వాలు ఉన్నాయి. తాజాగా ఆయన లండన్, ఐర్లాండ్ పౌరసత్వాలు వదులు కున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా అధిపతిగా ఆయన పనిచేశారు. కెనడా ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయడంలో మార్క్ కార్నీ ప్రముఖ పాత్ర వహించారు. ప్రముఖ బ్యాంకు అధిపతిగా టోక్యో, లండన్, న్యూయార్కులో 13 సంవత్సరాలు సేవలు అందించారు. కెనడాలోని ఈశాన్య ప్రాంతంలో జన్మించిన 58ఏళ్ల కార్నీ సరైన సమయంలో ప్రధానిగా రాబోతున్నారని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత భారత్‌తో వాణిజ్య బంధాలు మెరుగు పరచడానికి కృషి చేస్తానంటూ కార్నీ వ్యాఖ్యానించారు. భారత్‌తో సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. వాణిజ్య బంధంతో విలువలు పెంచుకోవాలి. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత భారత్‌తో సంబంధాలు పునరుద్దరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటూ ఆయన వ్యాఖ్యానించారు.