ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం నామినేషన్ల పర్వం నిన్న సాయంత్రం పూర్తయింది. అయితే బీజేపీ అభ్యర్ధిగా సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేయడంలో హైడ్రామా చోటు చేసుకుంది. నిన్న ఉదయం వరకూ బీజేపీ అభ్యర్ధి రంగంలో ఉంటారని కూడా తెలియని పరిస్థితిలో, గడువు ముగియడానికి పావుగంట ముందు సోము వీర్రాజు నామినేషన్ వేయగలిగారు.
మొత్తం ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవగా, వాటన్నిటినీ అధికార ఎన్డీయే కూటమి అభ్యర్ధులే గెలుచుకునే పరిస్థితి ఉంది. వాటిలో ఒకటి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించారు. మిగతా నాలుగింటిలో తెలుగుదేశం అభ్యర్ధులను నిలబెడతారని భావించారు. అయితే నామినేషన్ల ఆఖరి రోజైన సోమవారం ఉదయం కథ మారిపోయింది. ఒక సీటును బీజేపీకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడినుంచీ నామినేషన్ సమయం పూర్తయేవరకూ కథ ఉత్కంఠభరితంగా సాగింది.
నామినేషన్ల దాఖలుకు సమయం సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకే ఉంది. అయితే ఉదయం వరకూ తనకు అవకాశం లభిస్తుందని సోము వీర్రాజుకు తెలియదు. దాంతో ఆయన ఉదయం 10.30కు రాజమండ్రి నుంచి హుటాహుటిన బయల్దేరి శరవేగంగా అమరావతి చేరుకున్నారు. అసెంబ్లీలో తెలుగుదేశం శాసనసభా పక్ష కార్యాలయంలో కూర్చుని తన నామినేషన్ పత్రాలను, అఫిడవిట్లను సరిచూసుకున్నారు. కానీ, అభ్యర్ధి నామినేషన్‌తో పాటు పార్టీ తరఫున జత చేయవలసిన ఎ, బి ఫారాలు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో లేవు. అక్కడినుంచీ రన్నింగ్ రేస్ మొదలైంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సంతకం చేసిన రెండు ఫారాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కార్యాలయంలో ఉన్నాయి. అక్కణ్ణుంచీ బీజేపీ తెలంగాణ నాయకుడు టివిఎస్ఎన్ రాజ్ హుటాహుటిన ప్రత్యేక విమానంలో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వాటిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి సంతకం చేయవలసి ఉంది. ఆమె పార్లమెంటు సమావేశాల నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. ఆమె ఢిల్లీ నుంచి బయల్దేరి వచ్చేసరికి సమయం ముగిసిపోయే ప్రమాదం ఉంది. దాంతో ఫారాలపై సంతకాలు చేసేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజుకు బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. ఆ సమయానికి ఆయన ఏలూరు దగ్గరలో ఉన్నారు. ఆయనకు ఫోన్‌లో సమాచారం అందించగా, ఆయన పరుగు పరుగున గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఫారాలు తీసుకుని నేరుగా అమరావతి శాసనసభకు చేరుకున్నారు.
మరోవైపు, పురందరేశ్వరి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమరావతికి బయల్దేరారు. కానీ ఆమె అసెంబ్లీకి చేరుకునేసరికి ఆలస్యం అయేలా ఉండడంతో విశ్వనాథరాజే ఎ, బి ఫారాలపై సంతకాలు చేసారు. సోము వీర్రాజు తన నామినేషన్ పత్రాలతో పాటు విశ్వనాథరాజు సంతకం చేసిన ఫారాలను జత చేసారు. దాంతో దరఖాస్తు పూర్తయింది. కానీ దాఖలు చేయడానికి కేవలం 14 నిమిషాల గడువు మాత్రమే మిగిలింది. పురందరేశ్వరి ఇంకా రాకపోవడంతో పాటు మంత్రుల కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు.
నామినేషన్ దాఖలు ప్ర్రక్రియ పూర్తయిన కొద్దిసేపటికి పురందరేశ్వరి అమరావతి అసెంబ్లీకి చేరుకున్నారు. సోము వీర్రాజుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలతో కాసేపు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారైన సోము వీర్రాజును అభినందించారు. తరువాత బీజేపీ బృందం అంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసారు. బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
అలా, ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి నామినేషన్ దాఖలు చేసే ఘట్టం సోమవారం రోజంతా అత్యంత ఉత్కంఠభరితంగా మొదలై సుఖాంతంగా ముగిసింది.