కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దర్శనవేళల్లో మార్పులు చేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. సన్నిధానం వద్ద ఏర్పాటు చేసిన పవిత్రమైన 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా దాదాపు 20 నుంచి 25 సెకండ్లపాటు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు.
ఈ విషయాన్ని ఆలయ పాలకమండలి అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే మాస పూజలు, 12 రోజుల విషు పూజల సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు.
ఈ పద్ధతి విజయవంతమైతే రానున్న మండలం, మకరజ్యోతి సీజన్‌లో కూడా కొనససాగిస్తామన్నారు. ప్రసాదాల ధరలను కూడా పెంచబోతున్నట్లు తెలిపారు.
గత విధానంలో వార్షిక పూజల సందర్భంగా నిమిషానికి 250 నుంచి 300 మంది భక్తులు స్వామిని దర్శించుకునేవారని కానీ కేవలం 5 సెకన్ల పాటే దర్శన భాగం ఉండేదని అధికారులు తెలిపారు. భక్తుల నిరాశను దూరం చేసేందుకే నేరుగా మెట్లు ఎక్కే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
అలాగే మే 17న పంబా తీరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయ్యప్పస్వామి భక్తులు సమావేశం కానున్నారు.