నల్లమల అటవీ ప్రాంతంలో నంద్యాల జిల్లాలో ఉన్న జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ కూల్చివేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అటవీ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు చేసినందున కూల్చివేసామని అటవీశాఖ చెప్పడం భక్తులను ఆగ్రహానికి గురిచేసింది.
అదే అటవీ ప్రాంతంలో అన్యమతస్తుల అక్రమ నిర్మాణాల జోలికి అటవీశాఖ అధికారులు ఎందుకు వెళ్ళలేదని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా కనుమ లోయపల్లి దగ్గర పాలకొండ రక్షితారణ్యంలో మసీదును అక్రమంగా నిర్మించారు, ఆ మసీదు కోసం అక్రమంగా సిమెంట్ రోడ్ వేసారు. దానికి విద్యుత్ కనెక్షన్ ఎలా ఇచ్చారు, ఆ మసీదుపై అటవీ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు…. అని హిందూ భక్త సమాజం మండిపడుతోంది. సిద్ధవటం మండలం భాకరాపేట దగ్గర వందల యెకరాలు ఆక్రమించి క్రైస్తవ చర్చిని భారీస్థాయిలో నిర్మించారు. అది అక్రమ నిర్మాణం కాదా? దాన్ని ఎందుకు కూల్చడం లేదు? అని హిందువులు నిలదీసి ప్రశ్నిస్తున్నారు. లౌకికవాదం ముసుగులో కేవలం హిందువుల మీదనే ప్రతాపం చూపించే ప్రభుత్వాలకు, అధికారులకు అన్యమతస్తుల అక్రమాలు కనిపించడం లేదా? చట్టాలు రాకముందు నుంచీ ఉన్న హిందూ క్షేత్రాలను కూల్చివేయడంలో చూపుతున్న అత్యుత్సాహం, కొద్దికాలం క్రితమే అక్రమంగా నిర్మించిన చర్చి మసీదులపై ఎందుకు చూపించడం లేదని దుయ్యబడుతున్నారు.
అంతెందుకు, తిరుమలకు అత్యంత చేరువలో ముంతాజ్ హోటల్ కోసం భవనాలు నిర్మిస్తున్నారు. దానికి అనుమతులు లేవని తెలిసినా, పనులు ఆపివేయమని నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా నిర్మాణ పనులు ఆపకుండా కొనసాగుతుంటే ఏమీ చేయలేని ప్రభుత్వం, కాశినాయన ఆశ్రమాన్ని మాత్రం ఆదరాబాదరాగా ఎందుకు కూల్చివేసిందని హిందూ సమాజం ఆవేదనకు గురవుతోంది. గతంలో శ్రీశైలం సమీపంలోని అటవీ ప్రాంతంలో దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని, విగ్రహాలను కూడా అటవీ చట్టం మిషతోనే కూల్చివేసిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు.
కాశినాయన ఆశ్రమం ఉన్న జ్యోతిక్షేత్రానికి వెళ్ళే ఆర్టీసీ బస్సులను సైతం అక్కడికి వెళ్ళనీయకుండా ఆపివేసారని స్థానికులు తెలియజేసారు. పోరుమామిళ్ళ దగ్గరనుంచి జ్యోతిక్షేత్రం వరకూ వెళ్ళే బస్సులను ఇప్పుడు వరికుంట్ల గ్రామం వద్దనే ఆపేస్తున్నారని, అక్కణ్ణుంచి అటే వెనక్కు పంపించేస్తున్నారనీ వివరించారు. కాశినాయన ఆశ్రమం దగ్గరకు ఎవరూ చేరుకోకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాశినాయన ఆశ్రమాలు నల్లమల అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో పేదలకు ఆహారం అందిస్తుంటాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జ్యోతి క్షేత్రాన్ని భక్తులు శ్రద్ధాసక్తులతో సేవిస్తారు. కాశినాయన భక్తులు నంద్యాల, కర్నూలు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 100 కి పైగా అన్నదాన సత్రాలను పేదలు, బాటసారులు, యాత్రికులకు ఆహారం అందించడానికి స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. అలాంటి సత్రాలకు కేంద్రస్థానమైన జ్యోతి క్షేత్రాన్నే అటవీ శాఖ కూల్చివేసింది.
నిజానికి కాశీనాయన ఆశ్రమాలు ఎలాంటి నిధులూ సేకరించవు, ఆలయాలనూ నిర్మించవు. గత శతాబ్దంలో నంద్యాలకు చెందిన ప్రముఖ సాధువు కాశిరెడ్డి నాయన బోధనలతో ప్రభావితులైన భక్తులు కాశిరెడ్డి నాయన నివసించిన జ్యోతి క్షేత్రం సహా అనేక ప్రదేశాలలో అన్నదాన కేంద్రాలను ప్రారంభించారు. కాశినాయన బోధనల ప్రభావంతో రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలలో వేలాది మంది రైతులు ఆశ్రమాలకు విరాళాలు ఇచ్చారు, ఇస్తున్నారు.
కాశినాయన తన జీవితకాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో ప్రభావశీలమైన ఆధ్యాత్మిక గురువుగా నిలిచారు. ఆయన ఎల్లప్పుడూ సాదాసీదా దుస్తులే ధరించేవారు. అవి చిరిగిపోయినా పట్టించుకునే వారు కాదు. కాశినాయన అనుగ్రహం కోసం పెద్దపెద్ద రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు గంటలు గంటలు వేచిఉండి మరీ ఆయనను సందర్శించేవారు. అయినా ఆయన ఎప్పుడూ తన పరపతిని ఉపయోగించి ఆశ్రమాలు, లేదా గుడుల నిర్మాణానికి డబ్బులు వసూలు చేయలేదు. తాను అద్భుతాలు చేస్తానని ఎప్పుడూ జనాలను మోసగించలేదు. తన ఆశీస్సుల కోసం వచ్చేవారిపైన సైతం అరుస్తూ ఉండేవాడు. తన కాళ్ళకు నమస్కరించడం వల్ల ఏమీ రాదనీ, ఆకలితో ఉన్న పేదలకు ఆహారం పెట్టమనీ మాత్రం ఆయన చెప్పేవారు. 1996లో జ్యోతి క్షేత్రంలో ఆయన శివైక్యం చెందారు.
అటువంటి మహానుభావుడి ప్రేరణతో భక్తులు అన్నదానం నిర్వహిస్తూన్నారు. అలాంటి జ్యోతిక్షేత్రంలో నిర్మాణాలను కూల్చివేయడం హిందువులను మనస్తాపానికి గురిచేసింది. దాదాపు అర్ధశతాబ్ద కాలంగా ఉన్న నిర్మాణాలను అటవీ చట్టం పేరుతో కూల్చేయడం దారుణమని భక్తులు వాపోతున్నారు. అన్యమతస్తుల అక్రమ కట్టడాలను కనీసం తాకేందుకు ధైర్యం చేయలేని అధికార, పాలక వర్గాలు హిందువుల పవిత్ర క్షేత్రాలను, ఆగొన్నవారికి పట్టెడన్నం పెట్టే ఆశ్రమాలను కూల్చివేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.