అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన వీరభద్ర స్వామి పారువేట ఉత్సవం ఊరేగింపు మీద ముస్లిముల దాష్టీకాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టింది. మార్చి 4న జరిగిన ఆ ఘటనకు సంబంధించి సుమారు 200మంది హిందువుల మీద అక్రమ కేసులు పెట్టిన రాయచోటి అర్బన్ సబ్ ఇనస్పెక్టర్ జె నరసింహారెడ్డి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనీ, అక్రమంగా మోపిన కేసులు తొలగించాలనీ డిమాండ్ చేస్తూ విహెచ్‌పి ప్రతినిధులు అన్ని కలెక్టర్ కార్యాలయాల్లోనూ విజ్ఞాపన పత్రాలు సమర్పించారు.
ఎన్‌టిఆర్ జిల్లాలో విజయవాడ ధర్నాచౌక్ వద్ద విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి తమ డిమాండ్లను తెలియజేసారు. తక్షణ చర్యలు కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు కలెక్టర్ ద్వారా విజ్ఞాపన పత్రం అందచేసారు. ఆ కార్యక్రమంలో సాధుసంతులు, విహెచ్‌పి ఆంధ్ర ప్రాంత అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, కోశాధ్యక్షులు దుర్గాప్రసాద్ రాజు, విజయవాడ మహానగర్ శాఖా అధ్యక్షులు సాన శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రాఘవరాజు, వైఎస్ఎస్ ప్రసాద్, కార్యదర్శి క్రోవి రామకృష్ణ, సహ కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్, కోశాధికారి పేర్ల రవీంద్ర గుప్తా, హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు వెంగళరావు, అర్జున్ రావు, వివిధ క్షేత్రాల పెద్దలు, హిందూ బందువులు పాల్గొన్నారు.
రాయచోటిలో హిందువులపై దాడులు చేసిన నేరస్తులను వెంటనే శిక్షించాలని నిరసన ర్యాలీ చేపట్టారు. మిట్ట ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. రాయచోటిలో మార్చి 4న హిందువులపై, శ్రీ వీరభద్రస్వామివారి ఉత్సవం పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. తక్షణ చర్యల తీసుకోవాలని విహెచ్‌పి ప్రతినిథి డిమాండ్ చేసారు.
ప్ర్రకాశం జిల్లాలో ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత విశేష్ సంపర్క్ ప్రముఖ్ సీతారామయ్య నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అసలు నిందితులను వదిలేసి బాధితులపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. వారిని గుర్తించి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఈమని బలరామ్ మాట్లాడుతూ ఏకపక్షంగా వ్యవహరించి భక్తుల మీదే కేసులు పెట్టిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో విశ్వహిందూ పరిషత్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయచోటిలో హిందూభక్తులపై మతఛాందసవాదులు దాడికి దిగడం గర్హనీయమని శ్రీకాకుళం జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షులు లోకనాథం ఆనందరావు మండిపడ్డారు. రాయచోటిలో పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషం అన్నారు. రాయచోటి తరహా ఘటనలు మరలా చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.