తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీతానికి అంకితమైన పుంభావ సరస్వతి. 1948 నవంబరు 9 న రాజమహేంద్రవరంలో జన్మించారాయన. ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్.జానకి ఆయనకు స్వయానా పిన్నిగారు.
శ్రీయుతులు నేదునూరి, పశుపతి, మంగళంపల్లి గారలు వీరికి గురువులైనా, గరిమెళ్ళ వారి బాణీ ఆ ముగ్గురు త్రిమూర్తుల మేలు కలయిక అని చెప్పవచ్చు. నేదునూరి వారిలోని రాగభావం, పశుపతిగారి గాత్రంలోని శ్రుతిశుద్ధత, బాలమురళి వాణిలోని లాలిత్యం కలబోసిన బాణీ వీరిది.
అన్నమయ్య చేసిన పదార్చనకు గరిమెళ్ళవారి రాగాలు ‘బంగారానికి తావి’ అనిపిస్తాయి. 150కి పైగా రాగాలను తీసుకొని, 800కు పైగా సంకీర్తనలకు వైవిధ్యభరితంగా బాణీలు కట్టిన ఘనత వారిది. ఆయన స్వరపరచిన అన్నమయ్య సంకీర్తన వింటుంటే సాహిత్యం, దానికి తగిన సంగీతం జతగా కలసి మెలసి ‘అన్నమయ్య మనతో మాటాడుతున్నారా!’ అనిపిస్తుంది.
మోహన, హిందోళ, శుద్ధధన్యాసి వంటి రాగాలలో సాధారణంగా ఎవరు స్వరపరచినా పరిమితమైన అవే సంగతులు కనబడతాయి. కానీ గరిమెళ్ళవారు ఒకదానికొకటి భిన్నమైన స్వరప్రయోగాలతో, సాహిత్యంలో ఒదిగిపోయే విధంగా స్వరం సమకూర్చటం విశేషం. ఔడవ(5 స్వరాల) రాగాలలోనే ఆయన అధిక భాగం స్వరపరిచారు.
ఇక ఆయన సృష్టించిన రాగాల విషయానికొస్తే సుందరరంజని, వాణీప్రియ, చిత్ర కల్యాణి వంటి రెండు పదుల రాగాలను వినూత్న భావ ఆవిష్కరణలకు ఆలవాలమయేట్లు ఆయన సృజించారు. అది ఆయన మరో నవ్య శోధన. వారికి మృదంగ వాదనంలోనూ ప్రవేశం ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానముల రికార్డింగ్ ప్రాజెక్టు ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యుడినైన నా అనుభవంలో తెలుసుకున్నది ఏమంటే గరిమెళ్ళ వారు రూపొందించిన సిడిలకు కళ్లు మూసుకొని ఆమోదం తెలపటం తప్ప మరో ఆలోచన అనవసరం. అంత ప్రామాణికంగా ఉంటాయి అవి.
విశ్వమంతా పర్యటించి ఆయన నిర్వహించగా శ్రోతలు బ్రహ్మరథం పట్టిన 5000కు పైగా ప్రదర్శనలు, ‘అన్నమయ్య సంకీర్తన మహతి’, ‘అన్నమయ్య నాద జ్యోతి’ వంటి లెక్కకు మిక్కిలియైన బిరుదాలు,
సమర్పించిన అసంఖ్యాక ఆడియో సీడీలు…అన్నీ ఒక ఎత్తు అయితే ఆయన రచించి, స్వరపరచి, గానం చేసిన లలిత గీతాలు మరొక ఎత్తు. 2020 లో కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కారం అందుకున్నారు.
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి “శివపదం” కీర్తనలను స్వరపరచి ఆలపించడం కూడా. దాదాపు 150 శివపద కీర్తనలను వారు స్వరపరచి ఆలపించారు. అవి నిజంగా ఆణిముత్యాలే… మధుర భావ తరంగాలే.
గరిమెళ్ళవారు స్వరసహితంగా వెలువరించిన స్వీయరచిత ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతా స్తుతి రచనలు… అనేకం బహుళ జనాదరణ పొందాయి.
గరిమెళ్ళవారి గళం వినబడని ఆకాశవాణి కేంద్రం లేదు, భక్తిరంజని కార్యక్రమం లేదు. దేశమంతటా పర్యటించిన ఆయన, ‘అన్నమయ్య నాద యజ్ఞాలు’ ఎన్నో విజయవంతంగా నిర్వహించారు.
తిరుమల కొండపై భక్తులు స్వామి దర్శనార్థమై నిలుచున్నప్పుడు ఏ మూల ఉన్నా, ఏ చోటనున్నా, గాలిఅలలపై తేలివచ్చే గరిమెళ్ళవారి గళం చెవికి సోకగానే, మధురానంద భరితులవటం తథ్యం. తిరుమల తిరుపతి దేవస్థానానికి అంకితమైనారు గరిమెళ్ళ వారు.
వారి గాన కచేరీలెన్నో ప్రత్యక్షంగా విన్న భాగ్యవంతుణ్ణి. తాను ఏది పాడినా,ఆ పాటలోని ప్రతి మాటను, రాగంలోని ప్రతీ సంగతినీ స్ఫటికమంత స్వచ్ఛంగా పలికించగల గంధర్వ గానం వారిది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నిరాడంబర స్వభావి వారు. ఆయనకు నాతో పని ఉంటే స్వయంగా రెండు మూడు సందర్భాలలో మా ఇంటికి స్వయంగా వచ్చి నన్ను కలసి ఆశ్చర్యపరిచారు. తాను రచించిన ప్రతి గ్రంథాన్నీ ముందుగా నాకు అందచేసి,నా అభిప్రాయం తెలుసుకొనేవారు.
ఒకసారి బెజవాడలో అన్నమయ్య ఆరాధనలో నేను ఆయన సమక్షంలో అన్నీ ఆయన స్వరపరచిన సంకీర్తనలు పాడినప్పుడు, ఆయన ఆనందం వర్ణనాతీతం. ఆ ఆనందాన్ని అభినందన మందారమాలగా నాకు సమర్పించారాయన! తిరుపతిలో ఆయన హాజరుకాని నా కచేరీలు బహు కొద్ది మాత్రమే. నేనంటే అంత అభిమానం ఆయనకు!
ఆయన పలుకు ఎంత మంద్రమో గానమంత మార్దవము. అనవసర విన్యాసాలకు, ఆడంబర విద్వత్ ప్రదర్శనలకూ ఆయన దూరంగా ఉంటారు. అయితే, సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆయన చేయని సంగీత,సాహిత్య ప్రక్రియ లేదు. శ్రోతలను తనతోపాటు తోడ్కొనివెళ్ళి, ఏడుకొండలూ ఎక్కించి, తుట్టతుదకు స్వామి దివ్యదర్శనం చేయిస్తుంది గరిమెళ్ళవారి గానం. అది అనన్యసామాన్యం. ‘అన్నమయ్య కీర్తనలకు బాలకృష్ణప్రసాద్ గారి బాణీలకు సాటి మరిలేవు’ అనటం అతిశయోక్తి కాదు. అందుకే గరిమెళ్ళవారు ‘అన్నమయ్య వరప్రసాది’.