దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజీలాండ్ జట్టును భారత జట్టు ఓడించడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పాకిస్తాన్ నిర్వహించిన టోర్నమెంట్‌లో రంజాన్ నెలలో ముస్లిం దేశం దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారతదేశం గెలవడం భారతదేశంలోనే కొంతమందికి మింగుడు పడలేదు. విజయోత్సవాలు జరుపుకుంటున్న వారిపై రాళ్ళు రువ్విన ఘటనలు, పోలీసులు లాఠీఛార్జి చేసిన సంఘటనలూ చోటు చేసుకున్నాయి.
ఆదివారం రాత్రి భారత క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన వెంటనే మధ్యప్రదేశ్‌లో ఇండోర్ నగరం దగ్గర మహు పట్టణంలో క్రీడాభిమానులు రహదారుల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. భారత జట్టు విజయాన్ని వేడుక చేసుకునేందుకు ఊరేగింపుగా తిరుగుతున్నారు. ఆ క్రమంలో వారు పట్టణంలోని జామా మసీదు దగ్గరకు చేరుకున్నప్పుడు వారి మీద దాడి జరిగింది. అక్కడ ఎందుకు ఊరేగింపు చేస్తున్నారంటూ గొడవ మొదలుపెట్టారు. మాటామాటా పెరగడంతో ఊరేగింపు మీద రాళ్ళు రువ్వారు. ఆ దాడిలో పలువురు క్రికెట్ ప్రేమికులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు అసాంఘిక శక్తులు క్రీడాభిమానుల వాహనాలను ధ్వంసం చేసారు. రెండు వాహనాలకు, రెండు దుకాణాలకూ నిప్పు పెట్టారు.
మహారాష్ట్రలోని నాగపూర్‌లో క్రికెట్ ప్రేమికులు గతరాత్రి భారత్ విజయం సాధించిన వెంటనే రహదారుల మీదకు వచ్చి సంబరాలు మొదలుపెట్టారు. వేలసంఖ్యలో క్రీడాభిమానులు గుమిగూడడంతో వారిని నియంత్రించడం అనే పేరుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్రీడాభిమానులను చెల్లాచెదురు చేయడం కోసం లాఠీఛార్జి చేసారు.
అటువంటి సంఘటనలే తెలంగాణలోనూ జరిగాయి. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో హైవే మీద, మెట్రో స్టేషన్ దగ్గరా పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు. రోడ్ల మీద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారనే కారణంతో పోలీసులు క్రికెట్ ప్రేమికులను చితగ్గొట్టారు. తెలంగాణలోని కరీంనగర్‌లో కూడా పోలీసులు క్రీడాభిమానులపై లాఠీలు ఝుళిపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో గత రాత్రి వేలాదిమంది క్రికెట్ అభిమానులు భారత విజయాన్ని ఆస్వాదించేందుకు రోడ్లమీదకు వచ్చారు. చేతిలో మువ్వన్నెల జెండాతో వారు వేడుకలు చేసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ఒక సబ్-ఇనస్పెక్టర్ ఆ జెండాను లాక్కుని జెండాకర్రను విరిచేసారు. జెండాను తిరగేసి పట్టుకుని దానితోనే జనాలను అదిలించడం మొదలుపెట్టారు. జెండాను అపసవ్యంగా పట్టుకోవడంతో ఆ ఎస్సై మీద ప్రజలు తిరగబడ్డారు. అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఆ క్రమంలో పోలీసులు-క్రీడాభిమానులకూ మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన ఎస్సై అక్కడినుంచి పరారైపోయాడు. విషయం చిలికి చిలికి గాలివాన అవడంతో మూడు స్టేషన్ల నుంచి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రజలను శాంతంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేసారు.
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం వహించింది. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి లోబడి భారత క్రికెట్ జట్టు పాక్ గడ్డ మీద అడుగుపెట్టడానికి ఒప్పుకోలేదు. దాంతో భారత్ ఆడే మ్యాచ్‌లు అన్నింటినీ మరోచోటకు మార్చారు. ఆతిథ్య పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్ ప్రారంభంలోనే ఓడిపోయింది. దానికి తోడు ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రంజాన్ నెలలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ దాయాది దేశమైన భారత్ ఘనవిజయం సాధించింది. ఈ పరిణామాలు స్వదేశంలోనే చాలామందికి మింగుడు పడలేదు. రహదారుల మీదకు వచ్చి వేడుకలు జరుపుకుంటున్న యువతరం తమ మీద దాడులు జరగడాన్ని, పోలీసులు జులుం చేయడాన్నీ ప్రత్యక్షంగా చూసారు.
భారత్‌లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ టోర్నమెంట్ అంతా పాకిస్తాన్ అనుకూల వాదాన్నే భుజానికి ఎత్తుకుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకామె భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మీద విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ లావుగా ఉంటాడని, ఫిజికల్ ఫిట్‌నెస్ లేదని, అలాంటి వాడికి కెప్టెన్సీ ఎందుకనీ నోటికొచ్చిన చెత్త అంతా వాగారు. ఆ ట్వీట్ మీద వివాదం చెలరేగడంతో చివరికి దాన్ని తొలగించక తప్పలేదు. అయితే ఆమెపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు ఆ పార్టీ పాకిస్తాన్ ఓటమిని జీర్ణం చేసుకోలేకపోతోందన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. ఆ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల వేడుకల మీద కొన్నిచోట్ల రాళ్ళు రువ్వడం, కొన్నిచోట్ల పోలీసులు లాఠీచార్జి చేయడం వెనుక కాంగ్రెస్ లేదా ఒక మతం వారి ప్రచ్ఛన్న హస్తం ఉందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.