అభినవ అన్నమయ్యగా కీర్తి గడించిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందారు. తిరుపతి భవానీనగర్‌లో నివాసం ఉంటోన్న గరిమెళ్ల, ఆదివారం నడకకు వెళ్లిన సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ప్రతి శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన కచేరి ఉంటుంది. ఇక నుంచి ఆయన గానం వినపించదనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
గరిమెళ్ల వెయ్యికిపైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. నిత్య భక్తులు పాడుకునే వినరో భాగ్యము విష్ణు కథా లాంటి కీర్తనలు బహుళ ప్రాచుర్యం పొందాయి. 1948, నవంబరు 9న రాజమహేంద్రవరంలో జన్మించిన గరిమెళ్ల, సంగీతంలో డిప్లమో చేశారు. ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ వన్ సంగీతకారుడిగా రాణించారు.
గరిమెళ్ల 6 వేలకుపైగా కచేరీలు చేశారు. రాష్ట్ర, కేంద్ర అవార్డులు సొంతం చేసుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకున్నారు. 25 వేలకుపైగా స్వీయకృతును సృష్టించారు. 12 అన్నమాచార్య ప్రచురణలు చేశారు. వేలాది మందికి సంగీతం నేర్పించారు. తిరుపతి భవానీపురంలో ఆయన గృహమే సంగీత కళాశాలలా ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. గరిమెళ్ల మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర సంతాపం తెలిపారు.